Begin typing your search above and press return to search.

మరో రావుగోపాల్రావు అయ్యాడు కానీ!

By:  Tupaki Desk   |   16 March 2020 4:04 AM
మరో రావుగోపాల్రావు అయ్యాడు కానీ!
X
నిజానికి తెలుగు చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ క్యారెక్టర్‌ ఆర్టిస్టుల కొరత ఉంటుంది. అలాగని నటులు లేరా? అంటే చాలా మందే ఉన్నారు. కొంత మందిని బలమైన పాత్రల్లో చూపించలేకపోవడం.. మరికొందరిలో ఆ స్థాయి నటనా కౌశలం లేకపోవడం వంటి కారణాలతో రావుగోపాల్‌ రావు.. శ్రీహరి .. ర‌ఘువ‌ర‌ణ్.. కోట శ్రీ‌నివాస‌రావు రేంజ్ నటుల‌ కొరత స్పష్టంగా కనిపిస్తుంటుంది. మరోవైపు మన దర్శకులు కమర్షియాలిటీ కోసం ఇతర భాషల నుంచి ఆర్టిస్టులను ఇంపోర్ట్ చేసుకుని వారిని అందలం ఎక్కిస్తున్నారు. ఈ క్రమంలో లోకల్‌ టాలెంట్ ని గుర్తించడం లేదు. దీని కారణంగా ప్రతిభ ఉన్నా రాణించలేక చాలా మంది ఆర్టిస్టులు చిన్న చిన్న పాత్రలకే పరిమితం అవుతున్నారు.

ఒకప్పుడు రావుగోపాల్‌ రావు విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. హీరోలకు దీటుగా నటనని ప్రదర్శించి మెప్పుపొందారు. ఆయన నటన హీరోలను డామినేట్‌ చేసిన సందర్బాలు చాలానే ఉన్నాయి. విలన్ గా.. తండ్రిగా.. మామయ్య ఇలా విభిన్న పాత్రలతో తన నటవిశ్వరూపం చూపించారాయన. అలాంటి నటుల కొరత ఇప్పుడు చాలానే ఉంది. కొంత భాగం ఆయన తనయుడు రావు రమేష్‌ తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. మంచి పాత్రలు పడితే తన నట విశ్వరూపం చూపిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకుంటున్నారు. అందుకు నిదర్శనమే ఇటీవల ఆయన నటించిన `ప్రతి రోజూ పండగే`. సాయితేజ్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సాయితేజ్ కి తండ్రిగా రావు రమేష్‌ నటించారు. సినిమా మొత్తం ఆయన పండించిన ఎమోషన్.. సెంటిమెంట్‌.. కామెడీకి ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఓ రకంగా చెప్పాలంటే సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోశారు. కొడుకుగా నటించిన సాయితేజ్‌.. తాతగా నటించిన సత్యరాజ్‌ ఆయనకు రెండు భుజాలుగా ఉన్నారంతే. ఈ సినిమా ఆడిందంటే కేవలం రావు రమేష్‌ వల్లే అని మారుతి- సాయితేజ్‌ వంటి అందరు తారాగణం బహిరంగంగానే చెప్పడం విశేషం.

అలాంటి మరో పాత్రని రావు రమేష్‌ `సోలో బ్రతుకే సో బెటర్‌`లోనూ పోషిస్తున్నాడట. సాయితేజ్‌ హీరోగా నూతన దర్శకుడు సుబ్బు డైరెక్షన్ లో రూపొందుతున్న చిత్రమిది. ఇందులో ఆయన పాత్ర చాలా బలంగా ఉంటుందని తెలుస్తుంది. ఇది కూడా ఆ తరహాలోనే పండితే టాలీవుడ్ కి మరో రావు గోపాల్రావు దొరికారని.. ఆ గ్యాప్ ఫుల్ ఫిల్ చేశార‌ని చెబితే అతిశయోక్తి లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే కాదు ఇటీవల చాలా సినిమాలను ఆయన తన నటనతో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. దీంతోపాటు ప్రస్తుతం కెరీర్ ప‌రంగా ఆయ‌న క్ష‌ణం తీరిక అయినా చిక్క‌నంత బిజీగా ఉన్నారు. `లవ్‌ స్టోరి`.. కన్నడలో `కేజీఎఫ్‌ 2` వంటి పలు చిత్రాల్లో రావు రమేష్‌ నటిస్తూ బిజీగా ఉన్నారు.