Begin typing your search above and press return to search.

'రంగ్ దే' నుంచి రొమాంటిక్ 'ఏమిటో ఇది' సాంగ్ ప్రీల్యూడ్...!

By:  Tupaki Desk   |   5 Nov 2020 3:30 PM GMT
రంగ్ దే నుంచి రొమాంటిక్ ఏమిటో ఇది సాంగ్ ప్రీల్యూడ్...!
X
యువ హీరో నితిన్ - కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''రంగ్ దే''. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైమెంట్స్ బ్యాన‌ర్‌ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘రంగ్ దే’ ఫస్ట్ లుక్ మరియు టీజర్ కు విశేష స్పందన వచ్చింది. ఈ క్రమంలో రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన 'ఏమిటో ఇది' లిరికల్ సాంగ్ ప్రీల్యూడ్ ని ఈరోజు సాయంత్రం గం. 4.05 నిమిషాలకు చిత్ర యూనిట్ విడుదల చేసింది.

'ఏమిటో ఇది.. వివరించలేనిది.. మది ఆగమన్నది.. తనువు ఆగనన్నది..' అంటూ సాగిన ఈ పాటను కపిల్ కపిలన్ మరియు హరిప్రియ కలిసి ఆలపించారు. ఇద్దరు ప్రేమికులు మనసులో ఉన్న భావాలను ఒకరికొకరు చెబుతున్నట్లు వినిపిస్తున్న ఈ సాహిత్యాన్ని లిరిసిస్ట్ శ్రీమణి అందించాడు. ఈ ప్రీల్యూడ్ వింటుంటే దేవిశ్రీ ప్రసాద్ మరోసారి అద్భుతమైన రొమాంటిక్ ట్యూన్ అందించినట్లు అర్థం అవుతోంది. ఈ సాంగ్ కి గాయత్రీ రఘురామ్ - శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. 'ఏమిటో ఇది..' లిరికల్ వీడియో సాంగ్ ని నవంబర్ 7న సాయంత్రం గం. 4.05 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

కాగా, 'రంగ్ దే' చిత్రానికి లెజెండరీ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ వర్క్ చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. మొదటిసారిగా నితిన్ - కీర్తి సురేష్ కలిసి నటిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. లాక్‌ డౌన్‌ సడలింపుల్లో భాగంగా ఇటీవలే ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభించి కొన్ని కీలక సన్నివేశాలను చిత్రికరించారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ సన్నాహకాలు చేస్తున్నారు. 'భీష్మ' వంటి సక్సెస్ ఫుల్ సినిమా తర్వాత అదే బ్యానర్ లో నితిన్ నటిస్తున్న 'రంగ్ దే' ఏ స్థాయి విజయాన్ని అందిస్తుందో చూడాలి.