Begin typing your search above and press return to search.

పెళ్లికి రెడీ అవుతున్న ప్రేమపక్షులు!

By:  Tupaki Desk   |   27 Oct 2021 5:00 AM IST
పెళ్లికి రెడీ అవుతున్న ప్రేమపక్షులు!
X
రణ్ బీర్ కపూర్ .. అలియా భట్ ఈ ఇద్దరూ బాలీవుడ్ ప్రేమ పావురాలు. ఎక్కడ చూసినా ఈ ఇద్దరే కలిసి తిరుగుతుంటారు .. కలిసి ఎగురుతుంటారు. కొంతకాలంగా వీరి ప్రేమ వ్యవహారాన్ని గురించి మాట్లాడుకోని వారు లేరు .. వాళ్ల కదలికలను క్లిక్ మనిపించని కెమెరాలు లేవు. అంతగా వాళ్లు అంతా తామై సందడి చేశారు .. మీడియాకి కావలసిన ఫీడింగును ఫీల్ తో అందించారు. బాలీవుడ్ ప్రేమలన్నీ పెళ్లివరకూ వెళతాయని చెప్పలేం. ఎక్కడ ఎప్పుడు ఏ జంట బ్రేకప్ అవుతుందో ఎవరికీ తెలియదు. అక్కడ బ్రేకప్ అనే మాట వినకపోతే ఆశ్చర్యపోవాలి.

బాలీవుడ్ ను .. దానిపై దృష్టిపెట్టిన సినిమా ప్రేమికులు ఇప్పటివరకు ఎన్నో ప్రేమజంటలను చూశారు. అన్ని జంటలు అందంగానే కనిపించినా, వాటిలో పెళ్లి వరకూ వెళ్లినవి చాలా తక్కువ. కానీ రణ్ బీర్ కపూర్ - అలియా భట్ మాత్రం తమ ప్రేమను పెళ్లివరకూ తీసుకెళుతున్నారు. డిసెంబర్లో పెళ్లి చేసుకోవడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. నిజానికి వాళ్లు ఎప్పటికప్పుడు పెళ్లి దిశగా అడుగులు వేస్తూనే వచ్చారు. కానీ ఎప్పడూ ఏదో ఒక అవాంతరం కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. దాంతో అభిమానులు కూడా డీలాపడుతూనే వచ్చారు.

ఈ సారి మాత్రం తమ వైపు నుంచి వాళ్లు అన్ని ఏర్పాట్లను చూసుకుంటున్నారు. రాజస్థాన్ లోని 'ఐకానిక్' ప్యాలెస్ లో పెళ్లి జరగనుంది. బంధుమిత్రులను .. అత్యంత సన్నిహితులను పెళ్లికి ఆహ్వానిస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖులు చాలామంది ఈ పెళ్లికి హాజరుకానున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే పెళ్లి తేదీని ప్రకటించనున్నారు. రణ్ బీర్ కపూర్ - అలియా భట్ ఇద్దరికీ కూడా ఎవరి సినిమాలు వారికి ఉన్నాయి. ఇద్దరూ కలిసి 'బ్రహ్మాస్త్ర' చేస్తున్నారు. ముందుగా ఆ సినిమాను పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఇద్దరూ ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు.

మిగతా ప్రాజెక్టులను మాత్రం కొంత గ్యాప్ తీసుకునే చేస్తారట. అలా ఒక పక్కా ప్లానింగ్ తో ఈ జంట ముందుకు వెళుతోంది. హీరోల్లో రణ్ బీర్ కపూర్ కీ .. హీరోయిన్లలో అలియా భట్ కి మంచి క్రేజ్ ఉంది. అందువలన ఈ జంట క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. ఈ కారణంగానే వారి పెళ్లి సమయం కోసం వారికంటే ఎక్కువగా వెయిట్ చేసే అభిమానులు ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఈ స్థాయి క్రేజ్ ఉన్న జంట .. భార్యాభర్తలుగా ఒకటి కానుండటం ఇదే అని చెప్పొచ్చు. ఇప్పటివరకూ ఈ జోడీ వెంటపడి పరుగులు తీసిన కెమెరాలు .. ఇక వాళ్లను దంపతులుగా చూసిన తరువాత 'హమ్మయ్య' అనుకుంటూ ఆయాసం తీర్చుకుంటాయేమో!