Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: 'రణరంగం'

By:  Tupaki Desk   |   15 Aug 2019 8:51 AM GMT
మూవీ రివ్యూ: రణరంగం
X
చిత్రం : 'రణరంగం'

నటనటులు: శర్వానంద్ - కళ్యాణి ప్రియదర్శిని - కాజల్ అగర్వాల్ - మురళీ శర్మ - అజయ్ - బ్రహ్మాజీ - సుదర్శన్ - రాజా సిరివెన్నెల - ఆదర్శ్ బాలకృష్ణ - ప్రవీణ్ తదితరులు
సంగీతం: ప్రశాంత్ పిళ్లై
ఛాయాగ్రహణం: దివాకర్ మణి
మాటలు: అర్జున్-కార్తీక్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: సుధీర్ వర్మ

వైవిధ్యమైన కథలతో ప్రయాణం చేసే కథానాయకుడు శర్వానంద్. ‘స్వామిరారా’తో దర్శకుడిగా పరిచయమైన సుధీర్ వర్మ శైలి కూడా కొంచెం భిన్నమే. గత సినిమాలతో ఎదురుదెబ్బలు తిన్న వీళ్లిద్దరూ కలిసి చేసిన సినిమా ‘రణరంగం’. స్టైలిష్ ప్రోమోలతో క్యూరియాసిటీ పెంచిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీన్ని సంగతులేంటో చూద్దాం పదండి.

కథ:

దేవా (శర్వానంద్) విశాఖపట్నంలో అనాథగా పెరిగిన కుర్రాడు. తన లాంటి నలుగురు కుర్రాళ్లతో కలిసి చిన్న చిన్న పనులు చేసుకుని జీవితం సాగిస్తున్న అతను.. 90వ దశకంలో మద్యపాన నిషేధం అమలైన సమయంలో పొరుగు రాష్ట్రం నుంచి అక్రమంగా మద్యం తీసుకొచ్చి అమ్మడం ద్వారా డబ్బులు కళ్లజూస్తాడు. ఐతే అదే వ్యాపారం చేస్తున్న ఎమ్మెల్యేకు ఇది కంటగింపుగా మారుతుంది. దీంతో దేవాకు అడుగడుగునా అడ్డం పడుతుంటాడు. మరి ఈ అడ్డంకుల్ని అధిగమించి దేవా ఎలా ఎదిగాడు.. ఈ క్రమంలో ఏమేం కోల్పోయాడు.. ఏం సాధించాడు అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

‘రణరంగం’లో ఒక సన్నివేశం.. తనను అనేక రకరాలుగా ఇబ్బంది పెడుతున్న ఎమ్మెల్యేను గట్టి దెబ్బ తీయాలనుకుంటాడు హీరో. దీంతో గూడ్స్ బండిలో వస్తున్న అతడి సరకు దొంగిలించాలని అనుకుంటాడు. ఇందుకోసం ట్రాక్ మీద కాపు కాస్తాడు. అతను అక్కడ అడుగు పెట్టిన దగ్గర్నుంచి నేపథ్య సంగీతంతో అలజడి మొదలవుతుంది. కళ్లు మూసుకుని ఆ సౌండ్స్ వింటే సన్నివేశం గురించి తెలియకుండానే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఇక ఆ సీన్లో లైటింగ్ ఎఫెక్ట్ చూస్తే.. దీన్ని చూపిస్తూ ఫిలిం ఇన్ స్టిట్యూట్లో ఈ అంశం మీద ఒక పాఠం చెప్పేయొచ్చనిపిస్తుంది. అక్కడ ఆర్ట్ డైరెక్టర్ కూడా అద్భుతమైన పనితనం చూపించాడు. ఇక కెమెరా వర్క్ గురించి ఎంత చెప్పినా తక్కువే. విజువల్స్ కట్టిపడేస్తాయంతే. కాకపోతే.. మొత్తం సీన్ అయ్యాక అనేక సందేహాలు కలుగుతాయి. ఇంతకీ ఇక్కడ హీరో కొత్తగా ఏం చేశాడు.. ఈ సన్నివేశంలో ఏం ప్రత్యేకత ఉంది.. దీనికింత బిల్డప్ ఎందుకు.. అని. సినిమాలో చాలా చోట్ల ఇదే సమస్య. టేకింగ్ పరంగా ప్రతి సన్నివేశం అద్భుతంగా అనిపిస్తుంది. ఏ సీన్ కూడా పేలవంగా అనిపించదు. నయనానందం.. శ్రవణానందం.. రెండూ కలుగుతాయి. కానీ సినిమా అయ్యేసరికి మనసు మాత్రం నిండదు.

‘రణరంగం’ సినిమాకు హాలీవుడ్ క్లాసిక్ ‘గాడ్ ఫాదర్’ స్ఫూర్తి అని.. దాని స్క్రీన్ ప్లే ఫాలో అయ్యే ఈ సినిమా చేశానని చెప్పుకున్నాడు సుధీర్. ‘గాఢ్ ఫాదర్’ అద్భుతమైన సినిమానే. సందేహం లేదు. కానీ ఇంకా ‘గాడ్ ఫాదర్’ చూడని వాళ్లు.. ‘సత్య’ సహా దాని స్ఫూర్తితో గత రెండు దశాబ్దాల్లో వచ్చిన గ్యాంగ్ స్టర్ మూవీస్ అన్నీ చూశాక ఇప్పుడు దాన్ని చూస్తే ఏముంది ఇందులో ప్రత్యేకత అనిపించవచ్చు. ఎన్నెన్నో హార్రర్ సినిమాలు చూశాక ‘ఈవెల్ డెడ్’ చూసినా ఇలాంటి ఫీలింగే కలుగుతుంది. ‘గాఢ్ ఫాదర్’ స్టయిల్లో పదుల సంఖ్యలో సినిమాలు చూశాక మళ్లీ అదే స్ఫూర్తితో తెరకెక్కిన ‘రణరంగం’ చూసినా అదే పరిస్థితి. 90ల నాటి మద్య నిషేధం బ్యాక్ డ్రాప్ ఎంచుకోవడం వల్ల ఆటోమేటిగ్గా స్క్ర్రీన్ కొంచెం భిన్నంగా కనిపించడం సహజం. సాంకేతిక అంశాల విషయంలో ఎప్పుడూ సుధీర్ ఒక మెట్టు పైన ఉంటాడు కాబట్టి.. అప్పటి వాతావరణాన్ని ప్రెజెంట్ చేయడంలో.. నటీనటుల్ని చూపించిన విధానంలో.. బ్యాగ్రౌండ్ స్కోర్.. కెమెరా వర్క్ అద్భుతంగా ఉండేలా చూసుకోవడంలో అతను పూర్తిగా విజయవంతం అయ్యాడు. నరేషన్ బాగుండటం.. డైలాగుల బలం కూడా తోడవడంతో సన్నివేశాల వరకు అలా అలా పాస్ అయిపోతూ వెళ్లిపోతాయి. కానీ ఒక మామూలు కుర్రాడు గ్యాంగ్ స్టర్ స్థాయికి ఎదగడంలో కొత్తగా ఏమైనా చూద్దామంటే మాత్రం కనిపించదు.

గతంలో.. వర్తమానంలో నడిచే కథల్ని మార్చి మార్చి సమాంతరంగా చూపించడాన్ని ఇప్పుడు కొత్త స్క్రీన్ ప్లేగా ఎవ్వరూ చూడట్లేదు. అది సాధారణ వ్యవహారం అయిపోయింది. దీనికి ప్రేక్షకులు బాగా అలవాటు పడిపోయారు. పదుల సినిమాల్లో చూసిన వ్యవహారమే ఇక్కడా కనిపిస్తుంది. బ్యాక్ డ్రాప్ లో ఉన్న విశేషం వల్ల ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా వరకు ముందుకు లాక్కెళ్లిపోతుంది కానీ.. వర్తమానంలో నడిచే కథ మాత్రం ఏమంత ఆసక్తికరంగా అనిపించదు. చివరి పది నిమిషాల్ని మినహాయిస్తే.. సినిమాలో ఎక్కడా మలుపులంటూ ఏమీ ఉండవు. తన ప్రాంతంలో కాస్త జనబలం ఉన్న ఒక మామూలు కుర్రాడు.. ఒక ఎమ్మెల్యేకు ఎదురెళ్తే ఏం జరుగుతుందో ఈ సినిమాలో అదే కనిపిస్తుంది. అలాగే రౌడీ కుర్రాడు.. ఒక సంప్రదాయ కుటుంబంలోని అమ్మాయిని ప్రేమిస్తే తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో ఇందులోనూ అవే చూపించారు. ఇక వర్తమానంలోకి వస్తే డాన్ గా ఎదిగే క్రమంలో శత్రువుల్ని పెంచుకున్న వ్యక్తికి ఎలాంటి అనుభావాలు ఎదురవుతాయో అవే జరుగుతాయి. మొత్తంగా కథ పరంగా చూస్తే ఎక్కడా కొత్తదనం కనిపించదు. మలుపులుండవు. సినిమా అంతా ఏదో అలా లాక్కెళ్లిపోయి చివర్లో ఒక ట్విస్ట్ ఇవ్వడం సుధీర్ వర్మ గత సినిమా ‘కేశవ’లో చూశాం. దాదాపుగా అదే స్టయిల్ ఇక్కడా ఫాలో అయిపోయాడు. ఆ ట్విస్ట్ ఏమీ మైండ్ బ్లోయింగ్ అనిపించదు. అప్పటిదాకా సినిమాపై ఉన్న అభిప్రాయాన్నేమీ మార్చేయదు. మొత్తంగా చెప్పాలంటే ‘రణరంగం’ ఏదో అలా టైంపాస్ అయితే చేసేస్తుంది. సుధీర్ మార్కు స్టైలిష్ టేకింగ్.. సాంకేతిక ఆకర్షణలు బాగానే ఉన్నా.. అసలు విషయం తక్కువ కావడంతో ఇది ప్రత్యేకంగా నిలవలేకపోయింది.

నటీనటులు:

శర్వానంద్ ఎలాంటి పెర్ఫామరో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా ఎలా ఉన్నా తన వరకు ఎప్పుడూ నిరాశ పరచని శర్వా.. సగటు కుర్రాడి నుంచి డాన్ దాకా ఎదిగే దేవా పాత్రలో మెరిశాడు. సటిల్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. పాత్రలోని వేరియేషన్లను చక్కగా క్యారీ చేశాడు. తన భార్య చనిపోయినపుడు అరిచి గోల చేయకుండా భావోద్వేగాన్ని పండించిన హావభావాలు ఆకట్టుకుంటాయి. తనదైన స్క్రీన్ ప్రెజెన్స్ తో అతను ప్రతి చోటా మెరిశాడు. హీరోయిన్లలో కళ్యాణి ప్రియదర్శిని సంప్రదాయబద్ధమైన పాత్రలో సులువుగా ఒదిగిపోయింది. నటన పరంగా ప్రత్యేకత చాటుకునే అవకాశం తక్కువే కానీ.. ఉన్నంతలో బాగానే చేసింది. ఆమె లుక్ బాగుంది. కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పడానికేమీ లేదు. మురళీ శర్మ 90ల నాటి వైజాగ్ ఎమ్మెల్యేగా సరిగ్గా కుదరలేదు. నేటివిటీ మిస్సయినట్లు అనిపించింది. హీరో స్నేహితుల పాత్రల్లో సుదర్శన్ ఎక్కువ స్కోర్ చేశాడు. అతడి పంచులు కొన్ని చోట్ల బాగానే పేలాయి. రాజా సిరివెన్నెల, ఆదర్శ్ బాలకృష్ణ ఓకే. బ్రహ్మాజీ, అజయ్ పాత్రలకు తగ్గట్లుగా నటించారు. మిగతా వాళ్లంతా మామూలే.

సాంకేతికవర్గం:

పైన చెప్పుకున్నట్లే టెక్నీషియన్స్ ఎవరికి వారు అదరగొట్టేశారు. ప్రశాంత్ పిళ్లై నేపథ్య సంగీతం చాలా చోట్ల స్టాండ్ ఔట్ గా నిలిచింది. పెళ్లి పాట ప్రత్యేకంగా అనిపిస్తుంది. మిగతా పాటలు పర్వాలేదు. దివాకర్ మణి విజువల్స్ కట్టిపడేస్తాయి. ఆర్ట్ వర్క్ కూడా చాలా బాగుంది. నిర్మాణ విలువల విషయంలో అసలు రాజీ అన్నదే లేదు. సినిమాకు ఏం కావాలో అన్నీ సమకూర్చి పెట్టింది సితార సంస్థ. అర్జున్-కార్తీక్ రాసిన మాటలు కూడా బావున్నాయి. అనాథగా పెరిగిన హీరో.. హీరోయిన్నుద్దేశించి ‘నిన్ను పెంచారు. నేను పెరిగా’ అంటాడు. సింపుల్ గా అనిపిస్తూనే డెప్త్ ఉన్న ఇలాంటి డైలాగ్స్ చాలానే ఉన్నాయి సినిమాలో. ఐతే సాంకేతిక నిపుణులు.. నటీనటుల నుంచి మంచి ఔట్ పుట్ రాబట్టుకోవడంలోనే కాక టేకింగ్ లోనూ ఆకట్టుకున్న దర్శకుడు సుధీర్ వర్మ.. కథాకథనాల్లో పెద్దగా కొత్తదనం ఏమీ చూపించలేకపోయాడు. ‘కేశవ’లో మంచి పాయింట్ మీద కథ రాసి.. ఆ పాయింటుని సరిగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయిన సుధీర్.. ఈసారి కొత్త పాయింటే తీసుకోలేదు. గ్యాంగ్ స్టర్ కథ అనుకోవడంతోనే అతను కొన్ని పరిమితుల్లో చిక్కుకుపోయాడు. దాన్నుంచి బయటికి వచ్చి ప్రేక్షకులకు కొత్తగా ఏమీ అందించలేకపోయాడు. ప్రెజెంటేషన్ విషయంలో తిరుగులేని సుధీర్ కు మంచి కథ దొరికితే అద్భుతాలు చేయగలడనిపిస్తుంది కానీ.. సమస్యంతా ఆ కథను ఎంచుకోవడంలోనే ఉంది.

చివరగా: రణరంగం.. రొటీన్ కథకు అందమైన పూత

రేటింగ్-2.5/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre