Begin typing your search above and press return to search.

బాడీ పెంచితే.. బాహుబలి మూడొచ్చేస్తుంది

By:  Tupaki Desk   |   9 Jan 2016 11:00 PM IST
బాడీ పెంచితే.. బాహుబలి మూడొచ్చేస్తుంది
X
అన్ని సినిమాలూ ఒకలా ఉండవు. అన్ని సినిమాల్లో నటించడమూ ఒక్కలా ఉండదు. ‘బాహుబలి’ ఆ టైపు సినిమానే. ఈ సినిమాలో విలన్ పాత్ర పోషించిన రానా దగ్గుబాటి.. అందుకోసం ఎంత కష్టపడ్డాడో అందరికీ తెలుసు. మామూలుగానే భారీ కాయుడైన రానా.. ఈ సినిమా కోసం మరింత భారీగా తయారయ్యాడు. ఐతే ‘బాహుబలి.. ది బిగినింగ్’ విడుదల తర్వాత.. మళ్లీ ‘బాహుబలి.. ది కంక్లూజన్’ మొదలయ్యే లోపు ఒకట్రెండు సినిమాలు చేసేద్దామని ఫిక్సయిన రానా.. చకచకా ‘బెంగళూరు డేస్’ తమిళ రీమేక్ పూర్తి చేసేశాడు. ‘గాజి’ పేరుతో మరో బైలింగ్వుల్ సినిమా కూడా మొదలుపెట్టేస్తున్నాడు.

మరి ‘బాహుబలి’కి.. వేరే సినిమాలకు మధ్య ఎలా వైవిధ్యం చూపిస్తారు.. ఈ మధ్యలో బాడీని ఎలా మార్చుకుంటున్నారు అని రానాను అడిగితే.. ‘‘బాహుబలి సినిమా కోసం బరువు పెరగడానికి ఎంత కష్టపడ్డానో.. తగ్గడానికి కూడా అంతే శ్రమించాను. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ‘సైజ్ జీరో’ కోసం అనుష్క ఎంత కష్టపడిందో నేను కూడా నా బాడీ మార్చుకోవడానికి అంతే కష్టపడ్డా. బాహుబలి నుంచి బయటికి వచ్చాక బెంగళూరు డేస్ రీమేక్ కోసం 25 కిలోలు తగ్గాను నేను. మళ్లీ బాహుబలి-2 కోసం బాడీ పెంచాల్సి ఉంది. బాడీ తగ్గగానే మామూలు సినిమాల మూడ్ లోకి ఎలా వచ్చేస్తానో.. అలాగే బాడీ పెంచాక ఆటోమేటిగ్గా బాహుబలి మూడ్ వచ్చేస్తుంది. కాబట్టి రెండు రకాల సినిమాల్ని బ్యాలెన్స్ చేసుకోవడం నాకు ఇబ్బందేమీ కాదు’’ అని చెప్పాడు రానా.