Begin typing your search above and press return to search.

లైన్ లోకి రానా వచ్చాడా?

By:  Tupaki Desk   |   9 Oct 2018 4:28 AM GMT
లైన్ లోకి రానా వచ్చాడా?
X
ఇప్పుడు సినిమా సర్కిల్స్ లో ఎక్కువగా చర్చ జరుగుతున్న వార్త ఇటీవలే విడుదలై తమిళ్ లో సూపర్ హిట్ అయిన 96 గురించి. దీని రీమేక్ రైట్స్ రిలీజ్ కు ముందే కొనేసిన దిల్ రాజు అప్పుడే దీన్ని టాక్ అఫ్ ది టౌన్ గా మార్చేసారు. తమిళ్ వెర్షన్ లో నటించిన త్రిషనే తెలుగులోనూ చేయమని అడగడం అందుకు తను సానుకూలంగా స్పందించడం జరిగిందని నిన్న టాక్ కూడా వచ్చింది. కాని హీరో పాత్రే అసలు చిక్కుముడిగా మారింది. విజయ్ సేతుపతి మనకు పెద్దగా పరిచయం లేని వాడు. పేరున్న వాడే అయితే దిల్ రాజు డబ్బింగ్ చేసుకున్నా మంచి ఆదాయం వచ్చేది. ఆ ఛాన్స్ లేదు. రీమేక్ చేయాల్సిందే.

కాని ఎవరిని ఎంచుకోవాలి అనే మీమాంస ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. నాని అల్లు అర్జున్ లకు స్పెషల్ షో వేసి చూపించిన దిల్ రాజు వాళ్ళిద్దరి నుంచి సూపర్ అనే ఫీడ్ బ్యాక్ అయితే అందుకున్నాడు కాని మేము చేస్తాం అనే భరోసా రాలేదని ఫిలిం నగర్ న్యూస్. అయితే సహనిర్మాతలుగా ఉండేందుకు మాత్రం ఆసక్తి చూపినట్టుగా చెప్పుకుంటున్నారు.

ఇప్పుడు అనూహ్యంగా రానా సీన్ లోకి వచ్చాడట. ఈ సినిమా బాగా నచ్చడంతో వ్యక్తిగతంగా దిల్ రాజు తో ఫోన్ లో మాట్లాడి తన ఆసక్తిని వెలిబుచ్చి త్వరలో కలుద్దాం అని కూడా చెప్పినట్టు న్యూస్. 96లో హీరోది మధ్య వయసు పాత్రన్న సంగతి తెలిసిందే. అందుకే నాని బన్నీలు వెనుకడుగు వేయొచ్చు. కాని రానా పాత్ర నచ్చితే ఎలాంటి రిస్క్ అయినా చేస్తున్నాడు. ఇప్పుడు నిర్మాణంలో ఉన్న సినిమాల్లో చేస్తోంది కూడా యూత్ ఫుల్ పాత్రలు కావు. కాబట్టి 96కు రానా ఒకరకంగా మంచి ఛాయస్ గా మిగిలే అవకాశం ఉంది.

మరి దిల్ రాజు మనసులో ఏముందో. ఆయన మాత్రం విడుదల ఇంకో తొమ్మిది రోజులు మాత్రమే టైం ఉన్న హలో గురు ప్రేమ కోసమే ప్రమోషన్ ప్లస్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. అది రిలీజయ్యాక ఈ 96 వ్యవహారం ఒక కొలిక్కి రావొచ్చు. స్కూల్ ఏజ్ నుంచి మిడిల్ ఏజ్ దాకా ఒక జంట జీవన ప్రయాణమే ఈ 96. సున్నితమైన భావోద్వేగాలను ఆవిష్కరించిన తీరుకు కోలీవుడ్ లో మంచి ఆదరణ దక్కుతోంది. సరైన రీతిలో సూటయ్యే ఆర్టిస్టులతో తెలుగులో తెరకెక్కిస్తే మంచి ఫలితాన్ని అందుకునే అవకాశం ఉంది. కాకపోతే ఎవరు చేస్తారు అనే సస్పెన్స్ మాత్రం కొద్దిరోజులు భరించాలి.