Begin typing your search above and press return to search.

ఇది విశ్వక్ బ్రేకప్ సాంగ్ మాత్రమే కాదు.. కలర్ ఫుల్ ఫోక్ సాంగ్..!

By:  Tupaki Desk   |   31 March 2022 3:53 PM GMT
ఇది విశ్వక్ బ్రేకప్ సాంగ్ మాత్రమే కాదు.. కలర్ ఫుల్ ఫోక్ సాంగ్..!
X
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం ''అశోక వనంలో అర్జున కళ్యాణం''. విద్యా సాగర్ చింతా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అవుతోంది.

మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ గురువారం 'అశోక వనంలో అర్జున కళ్యాణం' సినిమాలోని 'రాంసిలకా' అనే బ్రేకప్ సాంగ్ ను విడుదల చేశారు. 'ఉరికే నా సిలికా.. నీ చక్కనైన పాట మెలిక..' అంటూ సాగిన ఈ పాట శ్రోతలను అలరిస్తోంది.

'గట్టు దాటి.. పుట్ట దాటి.. ఏడేడు ఏర్లు దాటి.. కొండ దాటి.. కోన దాటి.. కోసు కోస్లు దార్లు దాటి.. సీమసింత నీడకు వచ్చానే.. రంగు రంగు రాంసిలకా' అంటూ హీరో తన భాగస్వామిని కనుగొనడానికి ఎంత కష్టపడ్డాడనేది ఈ పాట వివరిస్తుంది. ఇందులో విశ్వక్ సేన్ వేసిన ఎనర్జిటిక్ స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి.

బ్రేకప్ సాంగ్ అని చెప్తున్నప్పటికీ.. సంగీత దర్శకుడు జై క్రిష్ ఫోక్ జానర్‌ లో కొత్త ట్యూన్ ట్రై చేశారు. 'అశోక వనంలో..' చిత్రానికి కథ, స్క్రీన్‌ ప్లే, మాటలు అందించిన 'రాజా వారు రాణి వారు' ఫేమ్ రవి కిరణ్ కోలా.. 'రాంసిలకా' పాటను ఆలపించారు. అంతేకాదు విజయ్ కుమార్ బల్లాతో కలిసి సాహిత్యం అందించారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన 'ఓ ఆడపిల్ల.. నువ్వు అర్థం కావా?' అనే పాట మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ క్రమంలో తాజాగా రిలీజ్ చేయబడిన బ్రేకప్ సాంగ్ కూడా ప్రేక్షకులను అలరిస్తోంది.

బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌వీసీసీ డిజిట‌ల్ బ్యాన‌ర్‌ పై బాపినీడు - సుధీర్ ఈదర సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవి కె పవన్ సినిమాటోగ్రఫీ అందించగా.. విప్లవ్ ఎడిటింగ్ వర్క్ చేసారు. ప్రవల్య దుడ్డుపూడి ప్రొడక్షన్ డిజైనింగ్ నిర్వహించారు.

మూడు పదుల వయసు వచ్చినా.. పెళ్లి కాని ఓ అబ్బాయి కథాంశంతో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా 'అశోక వనంలో..' సినిమా రూపొందింది. ఇందులో అల్లం అర్జున్ కుమార్ గా విశ్వక్ సేన్ నటిస్తుండగా.. పసుపులేటి మాధవి పాత్రలో రుస్కర్ కనిపించనుంది. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 22న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది.