Begin typing your search above and press return to search.

బాలయ్యతో వద్దన్నాడు..గోపీచంద్ హ్యాండిచ్చాడు

By:  Tupaki Desk   |   30 Dec 2015 10:30 PM GMT
బాలయ్యతో వద్దన్నాడు..గోపీచంద్ హ్యాండిచ్చాడు
X
తీసింది మూడు సినిమాలు.. అందులో రెండు పెద్ద ఫ్లాపులు.. ఒకటి యావరేజ్.. కానీ డైరెక్టర్ రమేష్ వర్మ మాటలు మాత్రం కొంచెం ఘనంగానే ఉంటాయి. అతడికి బాలయ్యతో సినిమా చేసే ఛాన్స్ వచ్చిందట.. కానీ తనే వద్దనుకున్నాడట. రవితేజ - గోపీచంద్ కాంబినేషన్లో బాలీవుడ్ హిట్ మూవీ ‘రేస్’ రీమేక్ చేయాలని కూడా అనుకున్నాడట.. అంతా ఓకే అన్నాక గోపీచంద్ హ్యాండివ్వడంతో ఆ సినిమా పక్కకు వెళ్లిపోయిందట. ఇక ఇళయరాజాకు రెండు కథలు చెబితే.. అందులోంచి ‘అబ్బాయితో అమ్మాయి’ ఓకే చేశాడట.. దాన్ని తమిళంలో కూడా తీయమన్నాడట. ఇంకా చాలా ముచ్చట్లే చెప్పాడు రమేష్ వర్మ.

‘‘రైడ్ సినిమా హిట్టయ్యాక బాల‌య్య బాబుతో సినిమా చేసే అవ‌కాశం వ‌చ్చింది. కానీ రెండు సినిమాల అనుభవమున్న నేను బాలయ్యతో సినిమా చేయగలనా అన్న అనుమానంతో నేనే ఆ సినిమా వదులుకున్నా. తర్వాత రవితేజ - గోపీచంద్ లతో బాలీవుడ్ మూవీ ‘రేస్’ రీమేక్ చేద్దామని రైట్స్ కూడా తీసుకున్నాను. భవ్య క్రియేషన్స్ ఆ సినిమాను నిర్మించాల్సింది. కానీ అంతా ఓకే అనుకున్నాక గోపీచంద్ నో అనేయడంతో ఆ సినిమా పక్కకు వెళ్లిపోయింది. ఆ తర్వాత రవితేజతో ‘వీర’ మొదలైంది. దీని తర్వాత వస్తా నీ వెనుక - అబ్బాయితో అమ్మాయి.. ఈ రెండు కథలూ చెప్పా. ఆయన రెండోదానికే ఓటేశారు. ఈ సినిమాను తమిళంలోనూ విడుదల చేయమని ఆయనే చెప్పారు. సి.కళ్యాణ్ గారు అక్కడీ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. నా తర్వాతి సినిమా వస్తా నీ వెనక కథతోనే చేస్తా. కానీ టైటిల్ మారుతుంది’’ అని చెప్పాడు రమేష్ వర్మ.