Begin typing your search above and press return to search.

రవితేజ డైరెక్టర్ ఇప్పటికి కోలుకున్నాడు

By:  Tupaki Desk   |   18 Aug 2015 1:53 AM GMT
రవితేజ డైరెక్టర్ ఇప్పటికి కోలుకున్నాడు
X
టాలీవుడ్ డైరెక్టర్ రమేష్ వర్మది విచిత్రమైన ప్రయాణం. పబ్లిసిటీ డిజైనర్ గా పని చేసి.. ‘ఒక ఊరిలో’ సినిమాతో డైరెక్టర్ అయ్యాడతను. తొలి సినిమా గురించి ఓ రేంజిలో చెప్పుకున్నాడు. కానీ ఆ సినిమా సరైన ఫలితాన్నివ్వలేదు. ఆ తర్వాత రమేష్ కథ అందించిన ‘మల్లె పువ్వు’ సినిమా కూడా చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఐతే ఓ కొరియన్ సినిమా స్ఫూర్తితో తీసిన ‘రైడ్’ సినిమా మళ్లీ అతణ్ని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా నిలబెట్టింది. ఈ ఊపులో రవితేజ లాంటి స్టార్ హీరోతో సినిమా చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు రమేష్ వర్మ. ఐతే బాలకృష్ణ కోసం తయారు చేసిన ‘వీర’ రవితేజ కు అస్సలు సెట్టవ్వలేదు. ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.

వీర కొట్టిన దెబ్బ నుంచి కోలుకోవడానికి రమేష్ వర్మకు రెండేళ్లకు పైనే పట్టింది. ఈ గ్యాప్ లో మంచి లవ్ స్టోరీ ఒకటి తయారు చేసుకుని సైలెంటుగా సినిమా మొదలుపెట్టి పూర్తి చేసేశాడు. నిర్మాతలూ కొత్తవాళ్లే. ఐతే టెక్నీషియన్స్ మాత్రం పెద్ద పెద్ద వాళ్లనే పెట్టుకున్నాడు రమేష్. తన కలల సంగీత దర్శకుడు ఇళయరాజాను ఈ సినిమాకు ఒప్పించడం విశేషం. రమేష్ తొలి సినిమాకే ఇళయరాజాను ట్రై చేశాడు. కానీ ఆయన ఒప్పుకోలేదు. ఆ తర్వాత రమేష్ కథ అందించిన ‘మల్లె పువ్వు’ సినిమాకు రాజా సంగీతాన్నందించారు. ఇప్పుడు అతడి దర్శకత్వంలో రాబోతున్న సినిమాకు మ్యూజిక్ ఇస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె.నాయుడు ఛాయాగ్రహణం అందిస్తున్నాడు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ చేశాడు రమేష్ వర్మ. పోస్టర్ లైతే ఆకర్షణీయంగానే ఉన్నాయి. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.