Begin typing your search above and press return to search.

తెలుగు క్వీన్ తెరచాటుకెళ్ళింది

By:  Tupaki Desk   |   18 April 2018 5:17 AM GMT
తెలుగు క్వీన్ తెరచాటుకెళ్ళింది
X
కంగనా రనౌత్ హీరోయిన్ గా బాలీవుడ్ లో కొన్నేళ్ల క్రితం వచ్చిన క్వీన్ సినిమా అప్పట్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ హీరోయిన్ ఓరియంటెడ్ ఫిలింని సౌత్ లో రీమేక్ చేయాలని చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నారు. ఎట్టకేలకు తెలుగు తమిళం కన్నడం మళయాళంలో ఒకేసారి రీమేక్ మొదలుపెట్టారు. ఇందుకోసం నాలుగు భాషల్లో నలుగురు క్వీన్లను ఎంచుకున్నారు. తమిళంలో కాజల్ అగర్వాల్.. మళయాళంలో మంజిమ మోహన్.. కన్నడంలో పారుల్ యాదవ్.. తెలుగులో తమన్నా లీడ్ క్యారెక్టర్లుగా షూటింగ్ స్టార్ట్ చేశారు.

క్వీన్ మళయాళం - తెలుగు వెర్షన్లకు తెలుగు డైరెక్టర్ నీలకంఠ.. కన్నడం - తమిళ వెర్షన్లకు కన్నడ యాక్టర్ అండ్ డైరెక్టర్ రమేష్ అరవింద్ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. ఒకటి రెండు షెడ్యూళ్లయ్యాక డైరెక్టర్ నీలకంఠకు.. హీరోయిన్ తమన్నాకు మధ్య తేడాలొచ్చాయి. దీంతో నీలకంఠ తెలుగు వెర్షన్ డైరెక్షన్ నుంచి పక్కకు తప్పుకొన్నాడు. రమేష్ అరవిందే తెలుగు వెర్షన్ నూ డైరెక్ట్ చేయడానికి రెడీ అయ్యాడు. కానీ రమేష్ అరవింద్ ప్రస్తుతం ఆలోచన మార్చుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు వెర్షన్ షూటింగ్ ను కొన్నాళ్ల పాటు పక్కన పెట్టాలని డిసైడయ్యాడట.

క్వీన్ తమిళం.. కన్నడం వెర్షన్ల షూటింగ్ చాలావరకు పూర్తయిపోయింది. వీటితో పోలిస్తే తెలుగు వెర్షన్ కు చాలా వర్క్ చేయాల్సి ఉంది. అందుకని ముందు రమేష్ అరవింద్ ఆ రెండింటి పని పూర్తి చేశాకే ఇక్కడ షూటింగ్ మొదలు పెట్టనున్నాడు. మరోవైపు నీలకంఠ డైరెక్ట్ చేస్తున్న మళయాళ వెర్షన్ కూడా దాదాపు పూర్తి కావచ్చింది. ఈ లెక్కన తెలుగు క్వీన్ ఇప్పట్లో తెరముందుకొచ్చే అవకాశం లేదనే చెప్పాలి.