Begin typing your search above and press return to search.

పవన్ రెండు పడవల ప్రయాణం నిర్మాతలకి ఇబ్బందిగా మారుతోందా..?

By:  Tupaki Desk   |   27 Nov 2020 2:40 PM IST
పవన్ రెండు పడవల ప్రయాణం నిర్మాతలకి ఇబ్బందిగా మారుతోందా..?
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి' తర్వాత సినిమాలపై ఫోకస్ తగ్గించి రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించే ప్రయత్నం చేశారు. అయితే గత సార్వత్రిక ఎన్నికలలో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోవడం.. మళ్ళీ ఎన్నికలకు చాలా సమయం ఉండటంతో జనసేన అధినేత రెండు పడవల మీద ప్రయాణం చేయడానికి నిర్ణయించుకున్నారు. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకోవడమే తరువాయి బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ ఫ్యాన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. ఇప్పటికే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'వకీల్ సాబ్' చిత్రం మెజారిటీ భాగం షూటింగ్ పూర్తి చేశాడు. అలానే క్రిష్ దర్శకత్వంలో సినిమాని స్టార్ట్ చేసి ఒక షెడ్యూల్ కంప్లీట్ చేశాడు. కోవిడ్ నేపథ్యంలో మళ్ళీ సెట్స్ లో అడుగుపట్టిన పవన్ కళ్యాణ్.. ఒకవైపు షూటింగ్ లో పాల్గొంటూనే మరోవైపు పార్టీ కార్యకలాపాలు చక్కబెడుతూ వస్తున్నారు. అయితే పవన్ ఇలా రాజకీయాలు చేస్తూ సినిమాలు చేయడం వల్ల అభిమానులు ఖుషీ అవుతున్నప్పటికీ.. నిర్మాతలు మాత్రం ఇబ్బందులు పడే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ కరోనా కారణంగా నిలిచిపోయిన 'వకీల్ సాబ్' షూటింగ్ లో పాల్గొన్నాడు. అయితే ఇప్పుడు తెలంగాణాలో జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తుండటంతో షూటింగ్ కి కాస్త విరామం ప్రకటించాడని అంటున్నారు. అలానే ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి లోక్ సభ బై ఎలక్షన్ కూడా త్వరలోనే రాబోతోంది. బీజేపీ కూటమితో కలిసి ప్రయాణిస్తున్న జనసేన పార్టీకి తిరుపతిలో పోటీ చేసే అవకాశం వచ్చినా రాకపోయినా అక్కడ పవన్ ప్రచారం చేయాల్సిన అవసరం ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ బీజీపీ పోటీలో దిగితే ఉప ఎన్నికల తమ కోసం ప్రచారం చేయాలని బిజెపి నాయకులు కోరే అవకాశం ఉంది. ఇదే కనుక జరిగితే పవన్ కళ్యాణ్ రాబోయే నెలల్లో తన తదుపరి ప్రాజెక్టుల షూటింగులను వాయిదా వేయాల్సి వస్తుంది. నిజానికి పవన్ వీలైనంత త్వరగా 'అయ్యప్పనుమ్ కోశియుమ్' తెలుగు రీమేక్ ని ప్రారంభిస్తారని అనుకున్నారు. ఇప్పుడు జనవరిలో తిరుపతి బై ఎలక్షన్ జరిగితే ఈ సినిమా ఇప్పట్లో స్టార్ట్ అయ్యే అవకాశం లేదు. అలానే క్రిష్ ప్రాజెక్ట్ మరియు హరీష్ శంకర్ సినిమా మరింత ముందుకు జరుగుతాయని చెప్పవచ్చు. సినిమాలు పోస్ట్ పోన్ అవుతూ ఉంటే ప్రొడ్యూసర్స్ కి ఎంత నష్టం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే పవన్ తో సినిమాలు చేస్తున్న మేకర్స్ కి ఇబ్బందులు కలిగే అవకాశాలు లేకపోలేదని టాక్ వినిపిస్తోంది.