Begin typing your search above and press return to search.

బాలీవుడ్లో ఆ మూవీ ప్రకంపనలు

By:  Tupaki Desk   |   24 Jun 2016 5:19 PM IST
బాలీవుడ్లో ఆ మూవీ ప్రకంపనలు
X
బాలీవుడ్లో విలక్షణమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అనురాగ్ కశ్యప్. బ్లాక్ ఫ్రైడే.. దేవ్-డి.. ది గర్ల్ ఇన్ ద ఎల్లో బూట్స్.. గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్.. ఇలా కశ్యప్ తీసిన ప్రతి సినిమా విలక్షణమైనదే. ఇండియన్ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఈ తరం దర్శకుల్లో అతడి పేరు ప్రముఖంగా చెప్పుకోవాలి. ఐతే కశ్యప్ నుంచి వచ్చిన లాస్ట్ మూవీ ‘బాంబే వెల్వెట్’ మాత్రం తీవ్రంగా నిరాశ పరిచింది. అతడి కెరీర్లో ఓ బ్లాక్ మోల్ అయిపోయింది. దీని తర్వాత కశ్యప్ ఎంతో కసిగా తీసిన సినిమా ‘రామన్ రాఘవ్ 2.0’. 80ల్లో నార్త్ ఇండియలోని ఓ ప్రాంతంలో వరుస హత్యలతో బెంబేలెత్తించిన ఓ సైకో కిల్లర్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు కశ్యప్.

ఈ రోజే ‘రామన్ రాఘవ్ 2.0’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఉదయం నుంచే అద్భుతమైన టాక్ తో మొదలైంది. కశ్యప్ మార్కు కథకాకథనాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయంటున్నారు. నవాజుద్దీన్ సిద్ధిఖి సైకో పాత్రలో చెలరేగిపోయి నటించగా.. అతడి పాత్రను.. కథనాన్ని కశ్యప్ అద్భుత రీతిలో తీర్చిదిద్ది ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశాడట. సైకో పాత్ర చేసే ఘోరాల నేపథ్యంలో కథనాన్ని ఉత్కంఠభరితంగా నడిపిస్తూ ప్రేక్షకుల్ని భలేగా థ్రిల్ చేశాడట కశ్యప్. నవాజుద్దీన్ టాప్ క్లాస్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టేశాడట. రెగ్యులర్ సినిమాలకు అలవాటు పడ్డవాళ్లకు ‘రామన్ రాఘవ్ 2.0’ పెద్దగా కిక్కివ్వకపోవచ్చు కానీ.. కశ్యప్ మార్కు వైవిధ్యమైన సినిమాలు ఆశించే వారిని మాత్రం ఈ సినిమా మెస్మరైజ్ చేస్తుందంటున్నారు. ఈ ఏడాది బాలీవుడ్లో వచ్చిన బెస్ట్ మూవీస్ లో ఇదొకటని అంటున్నారు.