Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ పై పొగుడుతూ పంచ్ వేశాడా?

By:  Tupaki Desk   |   8 July 2017 9:20 AM GMT
ఎన్టీఆర్ పై పొగుడుతూ పంచ్ వేశాడా?
X
రొటీన్ రొడ్డకొట్టుడు సినిమాలకు తెలుగులో ఎప్పుడో కాలం చెల్లిపోయింది. కంటెంట్ లేకపోతే స్టార్ హీరోల సినిమాలయినా నాలుగు రోజులకే సినిమా హాళ్లు ఖాళీ అయిపోవడం ఖాయం. ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోతే ప్రేక్షకులను మెప్పించడమూ కుదరదు.. నిర్మాతలకు కాసులు రాబట్టడమూ కుదరదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాస్త ఆలస్యంగా ఈ విషయం తెలుసుకున్నా త్వరగానే వంటబట్టించుకున్నాడు. టెంపర్ నుంచి తన స్టయిల్ మార్చేశాడు. అప్పటి నుంచి హిట్లు కొడుతూనే ఉన్నాడు.

తొలిసారి ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న జై లవకుశ షూటింగ్ చురుగ్గా సాగుతోంది. ఈ సినిమా టీజర్ రీసెంట్ గా జనం ముందుకొచ్చింది. ఈ టీజర్ చూసినవారెవరికైనా నటనలో ఎన్టీఆర్ స్టామినా ఏంటో తెలిసిపోతుంది. ఈ టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. టీజర్ చూసిన పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి ఇటు పొగడ్తల జల్లు కురిపిస్తూనే.. అటు పంచ్ కూడా వేశాడు. "మూస గొలుసులు తెంచుకున్న "మాస్" పులి కళ్ళతోనే వేటాడుతుంది'' అంటూ సింగిల్ లైన్లో అభివర్ణించాడు. గతంలో ఎన్టీఆర్ సినిమాలన్నీ మూస సినిమాలే అంటూ హింట్ ఇస్తూనే.. మాస్ పులి అంటూ పొగిడాడు. ఏదైనా ఇలా ఒకేసారి పంచులు వేస్తూ పొగడటం శాస్ర్తి గారికే చెల్లింది. ఏదేమైనా కూడా ఆయన చెప్పింది నిజమేలే.

ఇక సర్దార్ గబ్బర్ సింగ్ దర్శకుడు కె.రవీంద్ర (బాబి) డైరెక్షన్ లో జై లవకుశ రూపొందుతోంది. రాశీఖన్నా -నివేదా థామస్ తొలిసారి ఎన్టీఆర్ పక్కన హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. వరుస మ్యూజికల్ హిట్లు అందిస్తున్న దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్.