Begin typing your search above and press return to search.

'రామారావు ఆన్ డ్యూటీ' పవర్ ఫుల్ సీన్ లీక్..!

By:  Tupaki Desk   |   28 July 2022 11:48 AM GMT
రామారావు ఆన్ డ్యూటీ పవర్ ఫుల్ సీన్ లీక్..!
X
మాస్ మహారాజా రవితేజ హీరోగా నూతన దర్శకుడు శరత్ మండవ తెరకెక్కించిన స్పెషల్ యాక్షన్ థ్రిల్లర్ ''రామారావు ఆన్ డ్యూటీ''. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. రేపు శుక్రవారం(జులై 29) థియేటర్లలోకి రాబోతోంది. మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుందనగా.. ఇప్పుడు చిత్ర బృందానికి ఊహించని షాక్ తగిలింది.

తాజాగా 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాలోని కొన్ని సన్నివేశాలు లీక్ అయ్యాయి. రవితేజ పవర్ ఫుల్ డైలాగ్ తో కూడిన ఓ బిట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వ్యవహారంపై చిత్ర బృందం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్దమవుతున్నారని తెలుస్తోంది.

నెట్టింట చక్కట్లు కొడుతున్న క్లిప్పింగ్ ని బట్టి చూస్తే ఎడిటింగ్ రూమ్ నుంచే రామారావు ఆన్ డ్యూటీ సీన్ లీకైనట్లు అర్థం అవుతుంది. ఈ నేపథ్యంలో సినిమాపై హైప్ తీసుకురావడానికి చిత్ర బృందమే కావాలని లీక్ చేసిందని ఎందుకు అనుకోకూడదని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

లీకైన సన్నివేశాన్ని గమనిస్తే.. సినిమాలో అధికార పార్టీకి చెందిన రౌడీ మూకలకు రవితేజ సీరియస్ వార్నింగ్ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. 'మీరు ఎవరో ఏ పార్టీ వాళ్ళో నాకు అనవసరం.. అధికారంలో ఉన్నాం కదా అని.. గుంటలు తవ్వేస్తాం.. చెరువులు పూడ్చేస్తాం.. అడ్డంగా భూములు కొట్టేస్తాం అంటూ దౌర్జన్యం చేయాలని చూస్తే..' అంటూ వేలు చూపిస్తూ రవితేజ చెప్పడాన్ని ఇందులో చూడొచ్చు.

కాగా, 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాలో రవితేజ ఒక నిజాయితీ గల పవర్ ఫుల్ గవర్నమెంట్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఇందులో దివ్యాంశ కౌశిక్ - రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించగా.. వేణు తొట్టెంపూడి చాలా గ్యాప్ తర్వాత ఈ చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్నాడు.

శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్యామ్ సీఎస్ సంగీతం సమకూర్చగా.. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా.. ప్రవీణ్ కెఎల్ ఎడిటర్ గా వర్క్ చేశారు.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్ కు విశేష స్పందన లభించింది. రవితేజ ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా కొత్తగా కనిపించాడు. మరి 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా మాస్ రాజా కి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.