Begin typing your search above and press return to search.

పవన్ మిత్రుడి నుంచి కొత్త సినిమాలు

By:  Tupaki Desk   |   2 Sept 2018 7:00 AM IST
పవన్ మిత్రుడి నుంచి కొత్త సినిమాలు
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పుడు శరత్ మరార్ తో చాలా సన్నిహితంగా ఉండేవాడు. పవన్ సినిమాలతో పాటు వ్యక్తిగత వ్యవహారాల్ని కూడా మరార్ చూసుకునేవాడు. ఆ సాన్నిహిత్యంతోనే వరుసగా పవన్ తో మూడు సినిమాలు ప్రొడ్యూస్ చేసే అరుదైన అవకాశం దక్కించుకున్నాడు. కానీ వీళ్లిద్దరికీ ఎక్కడో చెడింది. దీంతో మరార్ పవన్ కు దూరం అయిపోయాడు. అదే సమయంలో రామ్ తాళ్లూరి అనే కొత్త ఫ్రెండు పవన్ కు సన్నిహితుడిగా మారాడు. పెద్ద స్థాయిలో వ్యాపారాలు చేస్తున్న రామ్ సినీ రంగంలోకి అడుగుపెట్టి ‘చుట్టాలబ్బాయి’.. ‘నేల టిక్కెట్టు’ సినిమాలు తీశాడు. అవి రెండూ అతడికి నిరాశనే మిగిల్చాయి. ‘నేల టిక్కెట్టు’ ఆడియో వేడుకకు పవన్ అతిథిగా వచ్చి రామ్ తో తన ఫ్రెండ్షిప్ గురించి వివరించాడు. పవన్ ‘జనసేన’కు రామ్ ఫండింగ్ చేస్తాడనే ఊహాగానాలు కూడా ఉన్నాయి.

ఆ సంగతలా వదిలేస్తే ‘నేల టిక్కెట్టు’ డిజాస్టర్ కావడంతో రామ్ కొంచెం స్లో అయిపోయాడు. తర్వాతి సినిమాను అనౌన్స్ చేయలేదు. ఐతే తాజా సమాచారం ప్రకారం ఆయన ఒకటికి రెండు ప్రాజెక్టులు ఓకే చేశాడు. కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ విద్యాసాగర్ తో రామ్ తన తర్వాతి సినిమాను నిర్మించనున్నాడు. దీని కోసం ఆయన కాస్టింగ్ కాల్ కూడా ఇచ్చాడు. మరోవైపు ఇంకో క్రేజీ ప్రాజెక్టును కూడా రామ్ లైన్లో పెట్టాడు. రవితేజ-వీఐ ఆనంద్ కాంబినేషన్లో రాబోయే సినిమాను కూడా రామ్ తాళ్లూరినే నిర్మిస్తాడట. ‘నేల టిక్కెట్టు’ రిలీజ్ కావడానికి ముందు ఆనంద్ తో రవితేజ సినిమా ఓకే అయింది. ఐతే నిర్మాత ఎవరన్నది స్పష్టత లేకపోయింది. ‘నేల టిక్కెట్టు’తో దెబ్బ తిన్న రామ్ కే ఈ సినిమా చేయాలని రవితేజ నిర్ణయించుకున్నాడట. త్వరలోనే రామ్ ఈ రెండు సినిమాల్ని ఒకదాని తర్వాత ఒకటి మొదలుపెట్టనున్నట్లు సమాచారం.