Begin typing your search above and press return to search.

పబ్లిక్ టాక్: 'రామ్ సేతు'

By:  Tupaki Desk   |   25 Oct 2022 10:30 AM GMT
పబ్లిక్ టాక్: రామ్ సేతు
X
బాలీవుడ్ చిత్ర పరిశ్రమ గత కొంతకాలంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఓవైపు సౌత్ సినిమాలు నార్త్ లో సత్తా చాటుతుంటే.. హిందీ చిత్రాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలం అవుతున్నాయి. స్టార్ హీరోలు నటించిన మూవీస్ సైతం మినిమమ్ ఓపెనింగ్స్ తెచ్చుకోలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో వరుస ప్లాప్స్ తో సతమతమవుతున్న అగ్ర హీరో అక్షయ్ కుమార్.. తాజాగా ''రామ్ సేతు'' అనే అడ్వెంచర్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

అక్షయ్ కుమార్ - జాక్వెలిన్ ఫెర్నాండెజ్ - సత్యదేవ్ - నుష్రత్ భరుచ్చా ప్రధాన పాత్రల్లో ''రామ్ సేతు'' సినిమా తెరకెక్కింది. 'పరమాణు' ఫేమ్ అభిషేక్ శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. చంద్ర ప్రకాష్ ద్వివేది సమర్పణలో కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ - అబండంటియా ఎంటర్టైన్మెంట్ - లైకా ప్రొడక్షన్స్ సంస్థలు కలిసి భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ కూడా నిర్మాణంలో భాగస్వామ్యం పంచుకుంది.

భారతీయ సంస్కృతి మరియు చారిత్రిక వారసత్వ మూలాల ఆధారంగా రూపొందిన యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా ప్రచారం చేయడంతో 'రామ్ సేతు' పై అందరిలో ఆసక్తి నెలకొంది. హిందీతో పాటుగా తెలుగు తమిళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈరోజు (అక్టోబర్ 25) థియేటర్లలోకి వచ్చింది.

హిందూ పురాణాలు ఇతిహాసాల ప్రకారం రామసేతు ను శ్రీరాముడు నిర్మించాడని విశ్వసిస్తారు. ఇలాంటి పురాతన భారతీయ వారసత్వాన్ని అన్వేషించాలనే ఆలోచనతో ఈ సినిమా రూపొందింది. ఇందులో ప్రఖ్యాత ఆర్కియాలజిస్ట్ గా అక్షయ్ కుమార్ నటించారు. రామసేతు సహజంగా ఏర్పడిందా? లేదా మానవ నిర్మితమా? అనేది నిర్ధారించే నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది.

ఇందులో పురాతన నిర్మాణమైన రామ్ సేతు గురించి వెల్లడించిన అంశాలు కొన్ని ప్రేక్షకులను బాగా ఎగ్జైట్ చేస్తున్నాయి. ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా ఉండగా.. సెకండాఫ్ లో వచ్చే కొన్ని ఛేజింగ్ సీన్స్.. రామ్ సేతు పై హీరో నడిచే సీన్స్ కూడా బాగున్నాయని అంటున్నారు. పురావస్తు శాస్త్రవేత్తగా అక్షయ్ కుమార్ తనదైన శైలిలో ఆకట్టుకున్నారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మరియు సత్యదేవ్ కూడా తమ పాత్రల్లో మెప్పించారు.

అయితే మంచి సబ్జెక్ట్ తీసుకున్న దర్శకుడు.. నీరసంగా సాగే స్క్రీన్ ప్లేని రాసుకొని, బోరింగ్ ట్రీట్మెంట్ తో 'రామ్ సేతు' ని నడిపించారని తెలుస్తోంది. ప్రేక్షకులను కట్టిపడేసే అడ్వెంచర్ థ్రిల్లర్ ను అందించడంలో ఫెయిల్ అయ్యారని అంటున్నారు. కథలోని వెళ్లడానికి చాలా సమయం తీసుకోవడమే కాదు.. సినిమా అంతా చాలా వరకు ఫ్లాట్ గా నడిపించారు.

సాంకేతికంగా సినిమాలో పెద్దగా లోపాలు కనిపించలేదని అంటున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ - నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటున్నాయి. నిర్మాణ విలువలు గొప్పగా ఉన్నాయి. అయితే దర్శకుడు అభిషేక్ శర్మ మంచి పాయింట్ ని తీసుకున్నా.. రచనపై ఎక్కువ శ్రద్ధ పెట్టలేదని తెలుస్తోంది.

మొత్తం మీద 'రామ్ సేతు' కు మిశ్రమ స్పందన వస్తోంది. ఒక అడ్వెంచర్ డ్రామా అయినప్పటికీ.. థ్రిల్ కు గురి చేసే విధంగా సినిమా లేదని.. కొన్ని సన్నివేశాలలో మాత్రమే ఆకట్టుకుందని ఆడియన్స్ వ్యాఖ్యానిస్తున్నారు. మరి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి వసూళ్ళు రాబడుతుందో చూడాలి.

ఇకపోతే బాలీవుడ్ మూవీ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ 'రామ్ సేతు' సినిమా మధ్యస్తంగా ఉందని చెబుతూ.. 2.5 రేటింగ్ ఇచ్చాడు. అద్భుతమైన విజువల్స్ - డీసెంట్ ఫస్ట్ హాఫ్ - అక్షయ్ కుమార్ & సత్యదేవ్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ లు పాజిటివ్ గా పేర్కొన్నారు. కానీ సెకండాఫ్ ఫ్లాట్ గా ఉంది. సబ్జెక్ట్ అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది కానీ.. రచన గందరగోళంగా ఉందని ట్వీట్ లో పేర్కొన్నాడు.

మరో ఫిలిం క్రిటిక్ జోగిందర్ తుటేజా 'రామ్ సేతు' కు 4.5 డేటింగ్ ఇచ్చాడు. క్లైమాక్స్ కోర్ట్ రూమ్ డ్రామా హైలైట్ గా నిలిచిందని.. ఈ సన్నివేశంతో ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ మెరుగ్గా ఉందని అభిప్రాయ పడ్డాడు. ఇందులో అక్షయ్ కుమార్ తో పాటుగా సత్యదేవ్ బాగా ఆకట్టుకున్నాడని అన్నారు. అతను సినిమా గ్రాఫ్ ను పెంచాడని.. అతని క్యారెక్టరైజేషన్ యొక్క ఔచిత్యాన్ని సినిమాలో చాలా అందంగా పొందుపరిచారని పేర్కొన్నాడు.