Begin typing your search above and press return to search.

బన్నీ గురించి అంత మాట అనేశారేంటి?

By:  Tupaki Desk   |   26 April 2016 6:13 AM GMT
బన్నీ గురించి అంత మాట అనేశారేంటి?
X
ఆ మధ్య యాంకర్ అనసూయ అల్లు అర్జున్ గురించి యధాలాపంగా అన్న మాటలు ఎంత పెద్ద దుమారం రేపాయో తెలిసిన సంగతే. ‘గంగోత్రి’ సినిమా చూసి.. ఇతను హీరో ఏంటి.. బ్యాగ్రౌండ్ ఉంటే మాత్రం ఇలాంటోణ్ని హీరోని చేసేస్తారా అనుకున్నానని.. కానీ తర్వాత అల్లు అర్జున్ తనను తాను మౌల్డ్ చేసుకున్న తీరు చూసి ఫ్యాన్ అయిపోయానని అంది అనసూయ. నిజానికి ఇందులో తప్పుబట్టాల్సిందేమీ లేదు. కానీ అభిమానులు మాత్రం ఆమె మాటల్ని మరోరకంగా తీసుకున్నారు. అనసూయను ఓ ఆటాడుకున్నాడు. హీరోల గురించి మాట్లాడేటపుడు అభిమానుల్ని దృష్టిలో ఉంచుకుని ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో అంత జాగ్రత్తగా మాట్లాడాలని అనసూయకు ఆ రోజు బాగానే బోధపడింది.

ఐతే బన్నీ పరోక్షంలో అనసూయ యధాలాపంగా అలా మాట్లాడితే.. ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్ ద్వయంలో ఒకరు బన్నీ ముందే ఇదే తరహాలో మాట్లాడి ఆశ్చర్యపరిచారు. ‘సరైనోడు’ సక్సెస్ మీట్ లో రామ్ మాట్లాడుతూ.. ‘‘గంగోత్రి సినిమా చూసి బ‌న్నీ హీరోగా ప‌నికిరాడు అంటూ ఇండ‌స్ట్రీలో చాలామంది కామెంట్ చేశారు. కానీ బన్నీ ఆ కామెంట్లను లెక్క చేయకుండా పనినే ప్రాణంగా భావించి.. సక్సెస్ సాధించి.. ప్రేక్షకుల గుండెల్లోకి బుల్లెట్ లాగా దూసుకెళ్లాడు’’ అన్నాడు. అప్పుడు దాదాపుగా అనసూయ కూడా ఇలాంటి కామెంట్లే చేసింది. ఆమెపై అభిమానులు పెద్ద ఎత్తున దాడి చేశారు. ఆ సంగతి తెలిసి కూడా రామ్ ఇలాంటి కామెంట్ చేయడం ఆశ్చర్యం కలిగించేదే. కాకపోతే బన్నీ అక్కడే ఉండబట్టి.. ఆ వ్యాఖ్యల్ని స్పోర్టివ్ గా తీసుకోబట్టి సరిపోయింది కానీ.. మరో వేదికలో ఎక్కడైనా ఇలా మాట్లాడి ఉంటే రామ్-లక్ష్మణ్ సోదరులకు బ్యాండ్ పడేదే.