Begin typing your search above and press return to search.

‘వీరప్పన్’ను ఇంకా పిండేయబోతున్న వర్మ

By:  Tupaki Desk   |   13 Jan 2016 11:30 AM GMT
‘వీరప్పన్’ను ఇంకా పిండేయబోతున్న వర్మ
X
వీరప్పన్ నుంచి ఇప్పటికే కావాల్సినంత రసం పిండుకున్నాడు రామ్ గోపాల్ వర్మ. చాలా ఏళ్ల తర్వాత వర్మ ఓ హిట్టు కొట్టాడంటే అదంతా.. వీరప్పన్ చలవే. ‘కిల్లింగ్ వీరప్పన్’ కన్నడలో సూపర్ హిట్టయి.. తెలుగులో కూడా ఓ మోస్తరుగా ఆడుతోంది. ఐతే తనకింత సాయం చేసిన వీరప్పన్ ను అక్కడితో వదిలేయట్లేదు. ఆ పాత్ర నుంచి మరింతగా రసం పిండడానికి రెడీ అయిపోతున్నాడీ సెన్సేషనల్ డైరెక్టర్. వీరప్పన్ గురించి బాగా అవగాహన ఉన్న సౌత్ ప్రేక్షకుల కోసం ‘కిల్లింగ్ వీరప్పన్’ తీసిన వర్మ.. మిగతా జనాల కోసం మొత్తం వీరప్పన్ చరిత్రనే చెప్పబోతున్నాడు. వీరప్పన్ పూర్తి జీవిత కథతో ‘వీరప్పన్’ అనే ఇంటర్నేషనల్ మూవీ తీయబోతున్నాడు.

ఈ ప్రాజెక్టు గురించి వర్మ వివరిస్తూ.. ‘‘కర్ణాటక జనాలకు వీరప్పన్ గురించి బాగా తెలుసు. అతణ్ని చంపిన ఆపరేషన్ కు సంబంధించిన విషయాలు మాత్రం అన్నీ తెలియవు. కానీ ఉత్తరాది ప్రేక్షకుల సంగతలా కాదు. వాళ్లకు వీరప్పన్ గురించి ఏమీ తెలియదు. అందుకే వీరప్పన్ జీవితం మొత్తాన్ని సినిమాగా తీసి వాళ్లకు అందిస్తా. అందుకే ‘కిల్లింగ్ వీరప్పన్’ను హిందీలో విడుదల చేయలేదు. ‘వీరప్పన్’ సినిమాకు మరింత భారీగా ప్రపంచ స్థాయి సినిమాగా తీర్చిదిద్దుతా. ఇది నా నుంచి వస్తున్న పూర్తి స్థాయి తొలి ఇంటర్నేషనల్ ఫిలిం. ఈ చిత్రానికి హాలీవుడ్ నిపుణులు పని చేస్తారు. ‘కిల్లింగ్ వీరప్పన్’ చూసిన ఒక దుబాయ్ బిజినెస్ మేన్ కి వీరప్పన్ పూర్తి కథను చెప్పినప్పుడు అతను ఆశ్చర్యానికి గురయ్యాడు. వీరప్పన్ ను చంపడం గురించే కాకుండా అతడి జీవిత చరిత్రను సినిమాగా తీయాలని సలహా ఇచ్చింది అతనే. ఒక అమెరికన్ పార్టనర్ తో కలిసి సినిమా నిర్మించడానికి కూడా అతనే ముందుకొచ్చాడు’’ అని వర్మ వెల్లడించాడు.