Begin typing your search above and press return to search.

వర్మ మాటలు నమ్మేదెట్టా?

By:  Tupaki Desk   |   5 July 2017 9:46 AM GMT
వర్మ మాటలు నమ్మేదెట్టా?
X
నిన్న ఎన్టీఆర్ మీద సినిమా తీయబోతున్నా అని ఘనంగా ప్రకటించాడు రామ్ గోపాల్ వర్మ. జనాలు నమ్ముతారో లేదో అని ఎన్టీఆర్ గురించి చాలా భావోద్వేగంతో మాట్లాడుతూ ఒక ఆడియో క్లిప్ కూడా రిలీజ్ చేశాడు. దానికి ‘జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్’ అంటూ ఒక పాట కూడా జోడించాడు. దీంతో మీడియాలో నిన్నట్నుంచి వర్మ తీయబోయే ఎన్టీఆర్ బయోపిక్ గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

కానీ గత కొన్నేళ్లలో బాగా విశ్వసనీయత కోల్పోయాడు వర్మ. పబ్లిసిటీ కోసం వర్మ చేసే విన్యాసాల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. పూటకో మాట మాట్లాడి.. తర్వాత తూచ్ అనేయడం.. తనకు తోచినపుడల్లా ఏదో ఒక సినిమా అనౌన్స్ చేసి.. ఆ తర్వాత ఆ సంగతి మరిచిపోవడం వర్మకు అలవాటైపోయింది. తెలుగులో వర్మ చివరగా తీసిన ‘వంగవీటి’ విషయంలో ఏమన్నాడో అందరికీ గుర్తే. తెలుగులో తనకు ఇదే చివరి సినిమా అన్నాడు. మళ్లీ టాలీవుడ్ వైపు చూడనన్నాడు. కానీ ఇక్కడ ఎన్టీఆర్ బయోపిక్ గురించి కొంత చర్చ నడుస్తున్న సమయంలో తనే స్వయంగా ఆ సినిమా తీయబోతున్నట్లు ప్రకటించాడు.

ఏదైనా ఇష్యూ హాట్ టాపిక్ అవుతున్నపుడు వర్మ టెంప్ట్ అయిపోయి సినిమా అనౌన్స్ చేయడం కొత్తేమీ కాదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత ‘రెడ్డిగారు పోయారు’ అంటూ ఓ సినిమా ప్రకటించాడు. అది ఏమైందో తెలియదు. గత ఏడాది నయీం ఎన్ కౌంటర్ జరగ్గానే ‘నయీం’ పేరుతో సినిమా చేయనున్నట్లు ప్రకటించాడు వర్మ. దీని షూటింగ్ మొదలైనట్లు కూడా వార్తలొచ్చాయి. కానీ తర్వాత దాని సంగతి అతీ గతీ లేదు. ఇక జయలలిత చనిపోయినపుడు.. శశికళ సీఎం కావచ్చని ప్రచారం జరిగినపుడు.. వాళ్లిద్దరి మీదా సినిమాలన్నాడు. అలాగే బెంగళూరు మాఫియా డాన్ ముత్తప్ప రాయ్ మీద కూడా ఓ సినిమా అనౌన్స్ చేశాడు.

కానీ ఇవేవీ కూడా ముందుకు కదిలిన ప్రాజెక్టులు కావు. ఇప్పుడు ఎన్టీఆర్ మీద అంటున్న సినిమా విషయంలోనూ జనాలకు నమ్మకాలు తక్కువే. అసలు వర్మ తీయబోయే సినిమాలో ఎన్టీఆర్ గా నటించేది బాలయ్యేనా కాదా అన్నదానిపైనే స్పష్టత లేదు. ఒకవేళ బాలయ్య కన్ఫమ్ చేస్తే.. ఆ తర్వాత దీని గురించి ఆలోచించొచ్చు. ప్రస్తుతానికైతే వర్మ తీస్తానంటున్న ఎన్టీఆర్ సినిమా విషయంలో మరీ ఎగ్జైట్ కావాల్సిన అవసరం లేదేమో.