Begin typing your search above and press return to search.

టైగ‌ర్ కేసీఆర్ లో వీటి సంగ‌తేంటి ఆర్జీవీ?

By:  Tupaki Desk   |   19 April 2019 4:40 AM GMT
టైగ‌ర్ కేసీఆర్ లో వీటి సంగ‌తేంటి ఆర్జీవీ?
X
కేసీఆర్ బ‌యోపిక్ ను తీయ‌టం అంత తేలికైన విష‌యం కాదు. చాలా ద‌మ్ము కావాలి. అయితే.. టాలీవుడ్ లో కానీ బాలీవుడ్‌లో కానీ ద‌మ్ము ట‌న్నుల లెక్క ఉన్న‌ట్లుగా చెప్పుకునే వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ ఏదైనా ప్రాజెక్టును టేక‌ప్ చేస్తే.. దాని విష‌యంలో ఎలా వ్య‌వ‌హ‌రిస్తారో తెలియంది కాదు.

ఇప్ప‌టివ‌ర‌కూ ఆయ‌న చేప‌ట్టిన కాన్సెప్ట్ ల‌న్నీ నెగిటివ్ గానే ఉంటాయి. కానీ.. ఏమైందో ఏమో కానీ.. కేసీఆర్ బ‌యోపిక్ ను ఫుల్ పాజిటివ్ గా చేయాల‌న్న‌ట్లుగా తాజాగా ఆయ‌న రిలీజ్ చేసిన టైగ‌ర్ కేసీఆర్ పోస్ట‌ర్ ను చూస్తే.. ఇట్టే అర్థమైపోతుంది. ఉమ్మ‌డి ఏపీలో ఎమ్మెల్యేగా.. డిప్యూటీ స్పీక‌ర్ గా.. మంత్రిగా వ్య‌వ‌హ‌రించి.. బాబు హ‌యాంలో మంత్రి ప‌ద‌వి రాని వేళ‌.. టీఆర్ఎస్ పార్టీ పెట్ట‌టం.. తాను క‌ల‌లు క‌న్న తెలంగాణ‌ను సాధించటం తెలిసిందే.

మ‌రి.. కేసీఆర్ రాజ‌కీయ జీవితంలోని ప్ర‌ధాన ఘ‌ట్టాల్ని వ‌ర్మ చూపించే వీలుందా? ఆ ద‌మ్ము ఉందా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. ఇంత‌కీ కేసీఆర్ బ‌యోపిక్ లో కేసీఆర్ కు సంబంధించి ఈ అంశాల్ని చూపిస్తారా? అని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. అవేమంటే?

+ విద్యార్థి సంఘం అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేసి ఓడిపోవ‌టం

+ సంజ‌య్ విచార్ మంచ్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేర‌టం

+ ఆ త‌ర్వాత కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి తాను అభిమానించే ఎన్టీఆర్ పార్టీలో చేర‌టం

+ 1983లో త‌న రాజ‌కీయ గురువు మ‌ద‌న్ మోహ‌న్ పై పోటీ చేసి 877 ఓట్ల‌తో ఓడిపోవ‌టం

+ ఉమ్మ‌డి రాష్ట్రంపైనా.. స‌మైక్య ఆంధ్ర మీద అసెంబ్లీలో కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లు

+ బాబు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌క‌పోవ‌టం అసంతృప్తికి గురై.. సొంత పార్టీ పెట్టుకోవ‌టం

+ టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు ప‌లువురు పార్టీకి గుడ్ బై చెప్పి.. కేసీఆర్ మీద సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌టం

+ దీక్ష చేసే క్ర‌మంలో నిమ్స్ ఆసుప‌త్రిలో ఏం జ‌రిగిందో చెప్ప‌టం

+ దీక్ష విర‌మ‌ణ కోసం ఆంధ్ర‌జ్యోతి ఎండీ ఆర్కే తిప్పిన చ‌క్రం.. ఆయ‌న‌కు కేసీఆర్ ఏం చెప్పారన్న‌ది?

+ ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ ఇచ్చిన నిమ్మ‌రసం గ్లాస్ చేతికి ఇవ్వ‌టం వెనుక ఏం జ‌రిగింది?

+ జైపాల్ రెడ్డి.. జానారెడ్డి త‌దిత‌రుల‌తో ర‌హ‌స్య భేటీల సారాంశాలు..!

+ కాంగ్రెస్ అధినేత్రితో జ‌రిగిన ర‌హ‌స్య స‌మావేశం. అందులో కేసీఆర్ ఇచ్చిన మాటేమిటి?

+ ఫిలింసిటి భూముల్లో ల‌క్ష నాగ‌ళ్ల‌తో దున్నేస్తాన‌న్న మాట‌

+ అలైన్ మెంట్ మార్చ‌కుంటే.. మెట్రో రైల్ ఫిల్ల‌ర్ల‌ను బాంబులు పెట్టి పేల్చేస్తాన‌న్న వ్యాఖ్య‌

మ‌రీ ముఖ్యంగా క‌రీంన‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల వేళ‌.. ఈనాడు అధినేత రామోజీరావు నివాస‌మైన రామోజీ ఫిలింసిటీకి వెళ్లిన సంద‌ర్భంగా వారి మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ‌.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అంశాలున్నాయి. మ‌రి.. వీట‌న్నింటిని ఆర్జీవీ త‌న సినిమాలో చూపిస్తారా? అంత ధైర్యం ఉందా? అన్న‌దిప్పుడు ప్ర‌శ్న‌గా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.