Begin typing your search above and press return to search.

దిశ ఘ‌ట‌న‌పై వ‌ర్మ ఇన్వెస్టిగేష‌న్

By:  Tupaki Desk   |   2 Feb 2020 10:43 AM GMT
దిశ ఘ‌ట‌న‌పై వ‌ర్మ ఇన్వెస్టిగేష‌న్
X
దిశ (ప్రియాంక‌రెడ్డి) ఘ‌ట‌న‌పై సంచ‌ల‌నాల‌ ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ సినిమా తీస్తున్న‌ట్లు శ‌నివారం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీంతో టాలీవుడ్ మీడియా ఫోక‌స్ అంతా ఇప్పుడు వ‌ర్మ‌పైనే ఉంది. దేశాన్ని కుదిపేసిన ఈ ఘ‌ట‌న‌ను వ‌ర్మ ఎలా డీల్ చేస్తాడు అన్న ఉత్కంఠ మొద‌లైంది. దిశ హ‌త్య‌...నిందితుల ఎన్ కౌంట‌ర్ సినిమా స్క్రిప్ట్ కి స‌రిప‌డినంత మ‌సాలా ద‌ట్టించి ఉన్న‌దే కావ‌డంతో దానిని ఆర్జీవీ అంతే ఎగ్జ‌యిటింగ్ ఆ మ‌లుస్తాడా అన్న‌ క్యూరియాసిటీ నెల‌కొంది. వ‌ర్మ ఇలా ప్ర‌క‌టించారో లేదో అలా వెంట‌నే ఇన్వెస్టిగేష‌న్ ప్రారంభించేశారు. ఆ స్క్రిప్టున‌కు అవ‌స‌ర‌మైన ముడిస‌ర‌కు వేట నేటి నుంచి మొద‌లు పెట్టాడు. నిందితులు జొల్లు శివ‌- చెన్న కేశ‌వులు- నీవీన్- ష‌రీఫ్ కుటుంబ స‌భ్యుల‌ను క‌లిసి వివరాలు అడిగి తెలుసుకుంటున్నాడు.

నేరుగా వ‌ర్మ హైద‌రాబాద్ లో ఉన్న త‌న ఆఫీస్ కే వాళ్ల‌ను పిలిపించి ఆరా తీస్తున్న‌ట్లు తెలుస్తోంది. ముందుగా చెన్నకేశ‌వులు భార్య రేణుకతో మాట్లాడి వివ‌రాల్ని ఆరా తీశారు. చెన్న కేశ‌వులు-రేణుక 16 ఏళ్ల వ‌య‌సులోనే ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. ప్ర‌స్తుతం రేణుక గ‌ర్భిణి. ఈ నేప‌థ్యంలో వ‌ర్మ ఎంతో భావోద్వేగంతో ట్విట‌ర్లో ఓ పోస్ట్ పెట్టాడు. బ్లాస్ట‌ర్డ్ చెన్నకేశ‌వులు దిశ‌ను మాత్ర‌మే కాకుండా రేణుక‌ని కూడా బాధిత‌రాలుగా మార్చాడు. వాడి వ‌ల్ల ఒక బాలిక మ‌రో బిడ్డ‌కు జ‌న్మ‌నిస్తుంది. ఇప్పుడు వారిద్ద‌రికీ భ‌విష్య‌త్ లేకుండా పోతుంది అంటూ ఆవేద‌న‌గా ట్వీట్ చేసాడు. దీన్ని బ‌ట్టి వ‌ర్మ మ‌రో ముగ్గురు కుటుంబ స‌భ్యుల‌ను క‌లిసి సంబంధిత వివ‌రాల్ని సేక‌రించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

ఇప్ప‌టికే యూ ట్యూబ్ లో ఆ కుటుంబాల‌కు సంబంధించిన బోలెడంత స‌మాచారం ఉంది. అయితే వ‌ర్మ అంత‌కు మించి త‌న స్క్రిప్ట్ న‌కు అవ‌స‌ర‌మైన వివ‌రాలు సేక‌రించ గ‌ల దిట్ట‌. ఆ న‌లుగురి పై గ‌తంలోనే ప‌లు నేరాల‌కు సంబంధించిన‌ కేసులు ఉన్న‌ట్లు దిశ ఘ‌ట‌న సమ‌యంలో పోలీసులు తెలిపారు. అయితే ఆ కేసుల స్వ‌రూపం ఏంటి? అన్న వివ‌రాలు కూడా ఈ సినిమాలో వ‌ర్మ చ‌ర్చించే అవ‌కాశం ఉంది. మొత్తానికి మ‌రోసారి వ‌ర్మ సంచ‌ల‌న సృష్టించ‌డం ఖాయ‌మ‌నే అనిపిస్తోంది.