Begin typing your search above and press return to search.

దత్తతపై వర్మ వింత వాదన

By:  Tupaki Desk   |   21 Sep 2015 10:56 AM GMT
దత్తతపై వర్మ వింత వాదన
X
నరేంద్ర మోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక గ్రామాల దత్తత అనే కాన్సెప్ట్ బాగా ప్రచారంలోకి వచ్చింది. ఎంపీలతో పాటు చాలా మంది ప్రముఖులు గ్రామీణ ప్రాంతాల్ని దత్తత తీసుకోవడానికి ముందుకొస్తున్నారు. ఈ మధ్య సినిమా స్టార్లు కూడా పెద్ద ఎత్తున గ్రామాల్ని దత్తత తీసుకుంటున్నారు. మహేష్ బాబు - శ్రుతి హాసన్ - ప్రకాష్ రాజ్ లాంటి వాళ్లు గ్రామాల్ని దత్తత తీసుకోవడం పెద్ద చర్చనీయాంశమైంది. ‘శ్రీమంతుడు’ సినిమాతో ఈ కాన్సెప్టుకి మంచి ప్రచారం కూడా లభించింది. డైరెక్టర్ తేజ లాంటి వాళ్లు దీనిపై సెటైర్ లు వేసినా.. మంచి పని చేస్తున్న సినీ ప్రముఖుల్ని జనాలు అభినందిస్తున్నారు.

ఐతే తేజకు గురువైన రామ్ గోపాల్ వర్మ దత్తత విషయంలో ఓ కొత్త వాదన చేస్తున్నాడు. సెలబ్రెటీలు గ్రామాల్ని దత్తత తీసుకోవడమంటే ఆ గ్రామాలకు అవమానమే అంటున్నాడు వర్మ. పల్లెటూళ్లు ఆత్మగౌరవంతో బతుకుతాయని.. ఏ గ్రామం కూడా దత్తతకు అంగీకరించదని అంటున్నాడు వర్మ. దీనికి ఇంకో ఉదాహరణ ఇస్తూ.. ఓ హాలీవుడ్ స్టార్ మన దేశం సరిగా అభివృద్ధి చెందలేదని చెప్పి దత్తత తీసుకోవడానికి ముందుకొస్తే ఎలా ఫీలవుతామో చెప్పండి అని లాజిక్ తీశాడు వర్మ.

ఈ పోలికలన్నీ బాగానే ఉంటాయి కానీ.. మన రాష్టాల్లో, దేశంలో కనీస మౌలిక వసతులు లేక.. కనీసం మంచి నీటి సౌకర్యం కూడా లేక ఇబ్బందులు పడుతున్న గ్రామాలకు లెక్కే లేదు. అలాంటి గ్రామాలకు వసతులు కల్పించడానికి సెలబ్రెటీలు ముందుకొస్తే ఆ గ్రామాలు ఎందుకు సంతోషించవు. ప్రభుత్వాలు ఎలాగూ సౌకర్యాలు కల్పించనపుడు సెలబ్రెటీలైనా ఆ వసతులు కల్పిస్తుంటే వర్మ ఈ వింత వాదన తేవడం ఏంటో?