Begin typing your search above and press return to search.

వర్మ పుష్కరాలనూ వదల్లేదు!

By:  Tupaki Desk   |   23 July 2015 9:52 AM IST
వర్మ పుష్కరాలనూ వదల్లేదు!
X
విషయం ఏదైనా స్పందించగల సమర్ధుడు రాం గోపాల్ వర్మ అని ఆయన అభిమానులు అంటుంటే... మనుగడను కాపాడుకోవడానికి ఇదొక మార్గం అని మరికొందరు అభిప్రాయపడుతుంటారు. ఈ రెండింటిలో వాస్తవం ఏదైనా కానీ... రాం గోపాల్ వర్మ స్పందించని విషయాలు దాదాపు చాలా తక్కువ! అవి సినిమాలైనా, రాజకీయాలైనా, సినిమా రాజకీయాలైనా, దేవుడి విషయాలపైనా, సమాజికపరమైన అంశాలైనా... వర్మ ట్వీటాల్సిందే!

ఇదే క్రమంలో తాజాగా గోదావరి పుష్కరాలపై స్పందించారు వర్మ! గోదావరి పుష్కరాలు పేరుచెప్పి నదీజలాల కాలుష్యం జరుగుతుంది అనే టాపిక్ ఎత్తుకున్న వర్మ... అభివృద్ధి చెందిన దేశాలు నదులను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్లే మరింత అభివృద్ధి చెందుతున్నాయని, మనం మాత్రం పుష్కరాలు, పుణ్యస్నానాలు అని చెప్పి నదులను కలుషితం చేస్తున్నామని ట్వీట్ చేశారు! వర్మ స్పందించిన టాపిక్ లో చాలా మంచి విషయం దాగి ఉందని పలువురు అంటుంటే... వర్మకు మరో ఆప్షన్ లేదని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు!

కాగా... పుష్కరాల ప్రారంభం రోజు రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాటపై కూడా వర్మ అంతకముందు స్పందించారు. తన భక్తులను ఆ దేవుడే కాపాడుకోలేకపోయాడు... పాపం చంద్రబాబు ఏం చేస్తారు అని తనదైన శైలిలో స్పందించాడు! అంతా... చంద్రబాబుది తప్పు అని నిందిస్తున్నారు కానీ... ఆదేవుడిని ఎందుకు నిందించరని ఎదురు ప్రశ్నించారు!