Begin typing your search above and press return to search.

వర్మ.. యాంకర్ కాళ్ల మీద పడ్డాడు

By:  Tupaki Desk   |   22 May 2016 2:37 PM IST
వర్మ.. యాంకర్ కాళ్ల మీద పడ్డాడు
X
రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. ఎవ్వరూ ఊహించని విధంగా మాట్లాడటం.. ప్రవర్తించడం వర్మకు అలవాటే. తాజాగా ఓ టీవీ షోకు ముఖ్య అతిథిగా హాజరైన వర్మ.. ఆ షో యాంకర్ కాళ్ల మీద పడబోవడం విశేషం. వర్మ అంత పని ఎందుకు చేశాడయ్యా అంటే.. తాను తీసిన ‘ఆగ్’ సినిమా నచ్చింది అన్నందుకే. ఇదంతా కలర్స్ టీవీ ఛానెల్లో ప్రసారమయ్యే ‘కామెడీ నైట్స్ విత్ బచ్చా’ కార్యక్రమంలో భాగంగా జరిగింది.

మూడేళ్ల విరామం తర్వాత బాలీవుడ్లోకి పునరాగమనం చేస్తూ వర్మ ‘వీరప్పన్’ సినిమా తీసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా కామెడీ నైట్స్..కార్యక్రమానికి వెళ్లాడు వర్మ. అందులో యాంకర్ మాట్లాడుతూ తనకు ‘ఆగ్’ సినిమా నచ్చిందని చెప్పింది. ఆ మాట అనగానే ఆమె కాళ్ల మీద పడబోయాడు. వర్మ తన కాళ్లు అందుకోడానికి కిందికి వంగుతుంటే యాంకర్ ఆపేసింది. ‘షోలే’కు రీమేక్ గా తీసిన ‘ఆగ్’ బాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్లలో నిలిచిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఫలితం గురించి తన మీద తానే ఎన్నోసార్లు సెటైర్లు వేసుకున్నాడు వర్మ. ఈసారి ఏకంగా తన సినిమా నచ్చిందన్నందుకు కాళ్లమీద పడబోయాడు.

ఇక ఈ షోలో వర్మ తనదైన స్టయిల్లో వేసిన పంచ్ లు భలేగా పేలాయి. సర్కార్ తీసిన రాము ఏమయ్యాడు అంటే మూడేళ్ల కిందట అతణ్ని ప్రేక్షకులు మర్డర్ చేశారని ఆయన వ్యాఖ్యానించాడు. ఇక బాగా బొద్దుగా ఉన్న యాంకర్.. తాను హాట్ గా ఉన్నాను కదా అంటే.. బదులుగా ‘‘36-24-36 కొలతలు లేని అమ్మాయిల్ని నేనసలు అమ్మాయిలుగానే పరిగణించను’’ అని వర్మ వ్యాఖ్యానించడం విశేషం. వర్మ మాటలకు ఆ యాంకర్ కు దిమ్మదిరిగిపోయింది.