Begin typing your search above and press return to search.

సర్దార్.. హిందీలో వద్దే వద్దంటున్నాడు

By:  Tupaki Desk   |   19 March 2016 4:29 PM IST
సర్దార్.. హిందీలో వద్దే వద్దంటున్నాడు
X
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగా ఎదురు దాడి చేసినా... ఎన్ని వార్నింగులు ఇచ్చినా.. రామ్ గోపాల్ వర్మ మాత్రం పవర్ స్టార్ విషయంలో సైలెంటుగా ఉండేలా లేడు. పవన్ కళ్యాణ్ కు తానే అతి పెద్ద అభిమానిని అని చెప్పుకునే వర్మ.. ఎప్పటికప్పుడు తన ఫేవరెట్ హీరో గాలి తీసే పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తూనే వస్తున్నాడు. ఈ మధ్య పవన్ గురించి ఎక్కువగా నెగెటివ్ ట్వీట్లే చేస్తూ వస్తున్న వర్మ.. తాజాగా మరోసారి పవన్ ను ఇరుకున పెట్టే మాటలు మాట్లాడాడు.

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాను హిందీలోనూ రిలీజ్ చేయాలనుకోవడంపై విమర్శలు గుప్పించాడు వర్మ. బాహుబలి ఆల్రెడీ బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన నేపథ్యంలో.. దాని కంటే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ పెద్ద విజయం సాధించకపోతే కష్టమని అంటున్నాడు వర్మ. అలాగే ‘బాహుబలి’కి ఉన్న విజువల్ మాగ్నిట్యూడ్ ‘సర్దార్..’కు లేదని.. కాబట్టి ఈ సినిమాను హిందీలో రిలీజ్ చేయాలనుకోవడం చాలా చాలా పెద్ద తప్పని అంటున్నాడు వర్మ.

హిందీలో ‘సర్దార్’ సినిమా రిజల్ట్ తేడా వస్తే నేషనల్ లెవెల్లో పవన్ కళ్యాణ్ కంటే ప్రభాసే పెద్ద హీరో అన్న అభిప్రాయం కలుగుతుందని.. ఇది పవన్ కళ్యాణ్ కు ఏమాత్రం మంచిది కాదని వర్మ అభిప్రాయపడ్డాడు. పవన్ సన్నిహితుల్లో ఎవరైనా తెలివైన వాళ్లు ఉంటే.. ‘సర్దార్..’ను హిందీలో రిలీజ్ చేయడం అనే తప్పు చేయకుండా చూడాలని సలహా ఇచ్చాడు వర్మ. పవన్ బాహుబలి కంటే మించిన సినిమా చేస్తేనే హిందీలో రిలీజ్ చేయాలని అభిప్రాయపడ్డాడు వర్మ.