Begin typing your search above and press return to search.

చిరుకు ఆ లోటును భర్తీ చేసేందుకే 'సైరా'

By:  Tupaki Desk   |   19 Feb 2019 11:36 AM IST
చిరుకు ఆ లోటును భర్తీ చేసేందుకే సైరా
X
చిరంజీవి ఆరు పదుల వయసు దాటినా కూడా సైరా చిత్రం కోసం మూడు పదుల వయసులో కష్టపడ్డట్లుగా కష్టపడుతున్నాడట. చిరంజీవి కష్టంను చూసి చిత్ర యూనిట్‌ సభ్యులు కూడా అవాక్కవుతున్నారట. ఈ వయసులో ఇలాంటి సాహసాలు, యాక్షన్‌ సీన్స్‌ చేయడం కేవలం చిరంజీవి గారికే సాధ్యం అయ్యిందని చిత్ర యూనిట్‌ సభ్యులు అంటున్నారు. అంతటి సాహస చిత్రం 'సైరా నరసింహారెడ్డి' షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీని రామ్‌ చరణ్‌ స్వయంగా నిర్మిస్తున్నాడు. దాదాపు రెండేళ్లుగా ఈ సినిమా గురించిన చర్చలు జరుగుతున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు ప్రేక్షకుల్లో ఆకాశానికి తాకాయి.

పరుచూరి బ్రదర్స్‌ ఈ స్క్రిప్ట్‌ ను పుష్కర కాలంగా పట్టుకుని తిరుగుతున్నారు. చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లక ముందే ఈ స్క్రిప్ట్‌ తో ఆయన వద్దకు వెళ్లడం జరిగింది. అయితే అప్పుడు చిరంజీవి ఏవో కారణాల వల్ల చేయలేక పోయాడు. ఇక చిరంజీవి రీ ఎంట్రీ మూవీగా 150వ చిత్రాన్ని ఉయ్యాలవాడ చరిత్రతో తీస్తే బాగుంటుందని కూడా కొందరు అన్నారు. రీ ఎంట్రీ మూవీకి అంత సాహసం వద్దని భావించిన చిరు ఖైదీ నెం.150 చిత్రాన్ని చేశాడు. ఇక 151వ చిత్రంగా సైరా నరసింహా రెడ్డిని భారీ బడ్జెట్‌ తో తీయాలని చరణ్‌ భావించాడు. ఈ సినిమా తీయడం వల్ల తండ్రి రుణం తీర్చుకున్న వాడిని అవుతానని చరణ్‌ భావించాడట.

చరణ్‌ గతంలో రాజమౌళి దర్శకత్వంలో 'మగధీర' చేస్తున్న సమయంలో నువ్వు తక్కువ వయసులోనే ఇలాంటి సినిమా చేసే అదృష్టం పొందావు, 149 చిత్రాలు చేసిన నాకు ఇలాంటి సినిమాలో నటించే అవకాశం రాలేదు. కాని నీకు ఆ అవకాశం వచ్చింది. నాకు కూడా ఇలాంటి సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఉండేది, కాని కుదరలేదు అంటూ చిరంజీవి ఒకానొక సమయంలో చరణ్‌ తో అన్నాడట.

150 చిత్రాలు చేసిన తండ్రి చిరంజీవి భారీ చిత్రాలను చేయలేదనే నిరుత్సాహంలో ఉండటం చూసిన చరణ్‌ ఎలాగైనా తండ్రితో ఆయనకు సంతృప్తిని ఇచ్చే సినిమా నిర్మించాలని భావించాడట. అందుకే కష్టం అయినా, ఎక్కువ ఇబ్బందులు ఉన్నా, ఆర్థికంగా వర్కౌట్‌ అవుతుందా అనే ఆలోచన లేకుండా సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని నిర్మించేందుకు చరణ్‌ సిద్దం అయ్యాడట. ఈ చిత్రం చిరంజీవికి చరణ్‌ ఇచ్చే గిఫ్ట్‌ కానుంది. ఇలాంటి చిత్రాన్ని చేయాలనే ఆసక్తితో చిరంజీవి కూడా ఈ వయసులో కూడా చాలా కష్టపడుతున్నాడు. సైరా కోసం చిరు పడుతున్న కష్టం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.