Begin typing your search above and press return to search.

చరణ్ రీమేక్.. భయపెడుతోంది

By:  Tupaki Desk   |   3 Nov 2015 11:12 AM IST
చరణ్ రీమేక్.. భయపెడుతోంది
X
మొన్నటి దాకా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు అన్నీ పాజిటివ్ గా కనిపించాయి. ‘బ్రూస్ లీ’తో రికార్డులు బద్దలు కొట్టేయబోతున్నాడని.. ఆ తర్వాత తమిళ బ్లాక్ బస్టర్ ‘తనీ ఒరువన్’ రీమేక్ తో మరో హిట్టు కొట్టబోతున్నాడని.. భారీ అంచనాలతో ఉన్నారు మెగా అభిమానులు. కానీ బ్రూస్ లీ ఫలితం తిరగబడటంతో ఇప్పుడన్నీ నెగెటివ్ గా కనిపిస్తున్నాయి. ‘బ్రూస్ లీ’ సినిమాతో తీవ్ర నిరాశకు గురైన మెగా అభిమానుల్ని ఇప్పు ‘తనీ ఒరువన్’ రీమేక్ కూడా భయపెడుతోంది.

మామూలుగానే ఈ మధ్య వేరే భాషల నుంచి రీమేక్ చేస్తుున్న సినిమాలు తెలుగులో అంతగా ఆడట్లేదు. వాటి సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంటోంది. ఒరిజినల్ పెద్ద హిట్టయినంత మాత్రాన దాని రీమేక్ కూడా ఆడుతుందన్న గ్యారెంటీ ఏమీ లేదు. ‘ఒరిజినల్’ ఫీల్ ను ఇక్కడ కూడా తీసుకురావడం అంత సులభమేమీ కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ‘తనీ ఒరువన్’కు పని చేస్తున్న టీమ్ విషయంలోనూ అభిమానులకు సందేహాలున్నాయి. అసలే చరణ్ ఇప్పుడు పెద్ద ఫ్లాప్ ఎదుర్కొన్నాడు. అతను కిక్-2తో డిజాస్టర్ ఖాతాలో వేసుకున్న సురేందర్ రెడ్డితో జతకడుతుండటం అభిమానులకు రుచించట్లేదు.

మరోవైపు ఇంకెవరూ దొరకలేదని.. పోయి పోయి ఫేడవుట్ అయిపోయిన ఇలియానాను హీరోయిన్ గా ఎంచుకోవడం, చరణ్ ను బాగా డామినేట్ చేసే అవకాశాలున్న అరవింద్ స్వామినే విలన్ గా ఫిక్స్ చేయడం కూడా అభిమానుల్లో ఆందోళన పెంచుతోంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. తెలుగులో ఎంటర్టైన్మెంట్ సినిమాల హవా నడుస్తున్న టైంలో ‘తనీ ఒరువన్’ లాంటి సీరియస్ సినిమా వర్కవుటవుతుందా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. మొత్తానికి ఓ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను రీమేక్ చేయబోతున్నపుడు ఉండాల్సిన ఉత్సాహమైతే ‘తనీ ఒరువన్’ విషయంలో కనిపించట్లేదు.