Begin typing your search above and press return to search.

ఈసారికి వదిలేయమంటున్న చరణ్

By:  Tupaki Desk   |   11 Oct 2015 11:00 PM IST
ఈసారికి వదిలేయమంటున్న చరణ్
X
శ్రీమంతుడు సినిమా జులై 17న విడుదల అని చాలా ముందే ప్రకటించారు ఆ సినిమా నిర్మాతలు. కానీ బాహుబలి అనుకోకుండా జులై 10కి వచ్చి పడింది. ఐతే మందు డేటిచ్చింది మేం కదా.. వెనక్కి తగ్గేది లేదు అంటూ మహేష్ మంకుపట్టు పట్టలేదు. బాహుబలి లాంటి సినిమాలు బాగా ఆడాలి అంటూ మూడు వారాలు వెనక్కి వెళ్లిపోయాడు. ఐతే ఇప్పుడు సరిగ్గా ఇలాంటి పరిస్థితే రుద్రమదేవి, బ్రూస్ లీ సినిమాల విషయంలోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ‘రుద్రమదేవి’ కూడా తెలుగు సినిమాకు గర్వకారణమే, ఆ సినిమా కూడా బాగా ఆడాల్సిందే.. అందుకే ‘బ్రూస్ లీ’ సినిమాను వాయిదా వేయాలన్న డిమాండ్లు వినిపించాయి. కానీ ‘బ్రూస్ లీ’ టీమ్ మాత్రం వెనక్కి తగ్గట్లేదు.

మరీ ఇంత పట్టుదలతో ఉన్నారెందుకు, ‘బ్రూస్ లీ’ని వాయిదా వేస్తే బాగుండేది కదా అని చరణ్ ను అడిగితే.. ఇప్పుడు వాయిదా వేస్తే చాలా తలనొప్పులు వస్తాయని.. చాలా సినిమాల షెడ్యూళ్లు డిస్టర్బ్ అవుతాయని.. కాబట్టే తప్పనిసరి పరిస్థితుల్లో అక్టోబరు 16నే విడుదల చేయాల్సి వస్తోందని చెప్పాడు. ఈసారికి మన్నించాలని.. ఇకపై తన సినిమాకు, ఇంకో పెద్ద సినిమాకు కనీసం రెండు వారాల గ్యాప్ ఉండేలా చూసుకుంటానని చరణ్ హామీ ఇచ్చాడు. ‘‘నిజానికి మేం చాలా ముందే రిలీజ్ డేట్ ఇచ్చాం. అక్టోబరులో వస్తున్న మిగతా రెండు సినిమాలూ ముందు రావాల్సినవి. అవి అక్టోబరుకు వాయిదా పడ్డాయి. ఎవరి వల్ల ఎవరికీ నష్టం రాకూడదనే కోరుకుంటున్నా. మూడు సినిమాలూ లాభాలు తెచ్చుకోవాలనే ఆశిస్తున్నా. భవిష్యత్తులో ఇలా జరగకుండా చూసుకుంటా’’ అని చరణ్ అన్నాడు.