Begin typing your search above and press return to search.

ముంబయి విచారణకు భిన్నంగా రకుల్ కు హైదరాబాద్ ఈడీ విచారణ అనుభవం

By:  Tupaki Desk   |   4 Sept 2021 9:00 AM IST
ముంబయి విచారణకు భిన్నంగా రకుల్ కు  హైదరాబాద్ ఈడీ విచారణ అనుభవం
X
టాలీవుడ్ కు హాట్ టాపిక్ గా మారిన డ్రగ్స్ ఉదంతంలో తాజాగా ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ ను ఈడీ అధికారులు విచారణ జరపటం తెలిసిందే. షెడ్యూల్ కంటే ముందే.. ఆమెను విచారించారు అధికారులు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ఈడీ అధికారుల ముందు హాజరు కావాల్సిన రకుల్.. గంటన్నర ముందే.. అంటే ఉదయం తొమ్మిది గంటలకే తన లాయర్.. చార్టర్డ్ అకౌంటెంట్ తో కలిసి విచారణకు హాజరయ్యారు. ముందుగా అనుకున్నట్లుగా ఉదయం పదిన్నర గంటలకే విచారణ షురూ చేశారు. ఈడీ జేడీ (జాయింట్ డైరెక్టర్) అభిషేక్ గోయల్ టీం రకుల్ మీద ప్రశ్నల వర్షం కురిపించింది.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. డ్రగ్స్ ఎపిసోడ్ బాలీవుడ్ ను ఊపేసిన వేళలోనూ.. రకుల్ అక్కడ కూడా విచారణకు హాజరయ్యారు. అయితే.. ముంబయిలో ఆమె నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారుల నుంచి నాలుగు గంటల విచారణను ఎదుర్కొంటే.. హైదరాబాద్ లో మాత్రం అందుకు భిన్నంగా ఆరు గంటల పాటు ఈడీ అధికారుల విచారణను ఎదుర్కొనటం సరికొత్త అనుభవంగా అభివర్ణిస్తున్నారు. ఛార్మీ మాదిరే కెల్విన్ ఎవరో తనకు తెలీదని చెప్పిన రకుల్ కు.. ఈడీ అధికారులు అతడితో ఆమె జరిపిన చాట్ ను చూపించిన ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.

ఆరు గంటల పాటు సాగిన విచారణలో ఎక్కువ భాగంగా ఆమె బ్యాంకు ఖాతా నుంచి నటుడు నవదీప్ కు చెందిన ఎఫ్ క్లబ్ కు నిధులు వెళ్లటం.. అక్కడి నుంచి ఆఫ్రికా దేశాలకు వెళ్లటంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్లుగా చెబుతున్నారు. ఈ బ్యాంకు లావాదేవీలన్ని గంటల వ్యవధిలోనే జరిగిన వైనాన్ని అధికారులు గుర్తించారు. గతంలో డ్రగ్స్ కేసును విచారించిన ఎక్సైజ్ అధికారుల విచారణలో రానా.. రకుల్ పేర్లు లేకపోవటం.. తాజాగా ఈడీ అధికారులు ఈ ఇద్దరి పేర్లను జాబితాలోకి చేర్చటం ఆసక్తికరంగా మారిందన్న మాట వినిపిస్తోంది.