Begin typing your search above and press return to search.

పాపం రకుల్ ప్రీత్ కష్టం గుర్తించండయ్యా

By:  Tupaki Desk   |   8 Dec 2016 10:52 AM GMT
పాపం రకుల్ ప్రీత్ కష్టం గుర్తించండయ్యా
X
అందరూ ‘ధృవ’ సినిమా కోసం రామ్ చరణ్ మేకోవర్ గురించి.. సిక్స్ ప్యాక్ చేయడానికి అతడు పడ్డ కష్టం గురించే మాట్లాడుతున్నారు. కానీ ఆ సినిమా హీరోయిన్ రకుల్ ప్రీత్ కూడా చాలా త్యాగాలే చేసిందట. చాలా కష్టమే పడిందట. ఈ సినిమాలో ఒక పాట కోసం తాను కొన్ని రోజుల పాటు తిండీ.. నీళ్లు త్యాగం చేయాల్సి వచ్చిందని అంటోంది రకుల్. తన కెరీర్లో ఏ సినిమాకూ ఇలా కడుపు మాడ్చుకోలేదని ఆమె చెప్పింది. ఇంతకీ ఆమె అంతగా ఎందుకు కష్టపడిందో తన మాటల్లోనే తెలుసుకుందాం పదండి.

‘‘ధృవ సినిమాలో పరేషానురా పాట కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆ పాటలో నేను అందంగా కనిపించడం కోసం నాకు డైట్ విషయంలోనూ షరతులు పెట్టారు. నాలుగు రోజుల పాటు రాత్రి పూట నేను అసలు నీళ్లే తాగలేదు. ఆ పాట చిత్రీకరించినన్ని రోజులు చాలా తక్కువ డైట్ తీసుకున్నా. రోజుకు 5 బాదం పప్పులు.. ఒక పీస్ పుచ్చకాయ.. ఇంకో రెండు డ్రై ఫ్రూట్స్.. కొన్ని గుక్కల నీళ్లు.. వీటికే పరిమితం చేసేవాళ్లు. ప్యాకప్ అయ్యాక మాత్రం బాగా నీళ్లు తాగి.. ఆ తర్వాత గంట పాటు వర్కవుట్ చేయించేవాళ్లు. అదయ్యాక రాత్రి 9 గంటల నుంచి ఉదయం వరకు ఒక్క గుక్క కూడా నీళ్లు తాగకూడదు. నాలుగు రోజుల పాటు ఇలా స్ట్రిక్టుగా షెడ్యూల్ కొనసాగించాను. అందుకే ఈ పాటలో నా లుక్ చాలా బాగుంటుంది. ఈ పాట ముగిసిన రోజు... ‘షూట్ అయిపోయింది.. రకుల్ కు తిండి పెట్టండిరా’ అన్న మాట వినిపించింది. ఈ పాట చిత్రీకరణ నాకు ప్రత్యేకమైన అనుభవం’’ అని రకుల్ తెలిపింది.