Begin typing your search above and press return to search.

రకుల్‌... లండన్‌లో దిగిపోయింది!

By:  Tupaki Desk   |   6 July 2015 9:44 AM IST
రకుల్‌... లండన్‌లో దిగిపోయింది!
X
ఎన్టీఆర్‌ 25వ చిత్రం షురూ అయ్యింది. సుకుమార్‌ దర్శకత్వం వహించనున్న ఆ చిత్రం ఈ రోజే లండన్‌లో మొదలైంది. హీరో హీరోయిన్లపైనే తొలి షెడ్యూల్‌ తెరకెక్కించబోతున్నట్టు తెలిసింది. అందుకే రకుల్‌ లండన్‌లో ల్యాండ్‌ అయిపోయింది. 'లండన్‌లో దిగాను. ఎన్టీఆర్‌ సినిమా షూటింగ్‌ మొదలవుతోంది. కొత్త జనాలు, కొత్త టీమ్‌' అంటూ రకుల్‌ ట్వీట్‌ చేసింది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాకి 'నాన్నకు ప్రేమతో' అనే పేరుని పరిశీలిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇటీవలే సుకుమార్‌ మళ్లీ నిర్ణయం మార్చుకొని 'దండయాత్ర' అనే పేరునే ఫిక్స్‌ చేశాడని చెప్పుకొంటున్నారు. అయితే పేరు గురించి టీమ్‌ మాత్రం ఇంకా స్పందించలేదు.

'టెంపర్‌' తర్వాత ఎన్టీఆర్‌ చేస్తున్న సినిమా ఇదే. విజయం కోసం చాలాకాలంగా ఎదురు చూసిన ఆయన ఎట్టకేలకు 'టెంపర్‌'తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. రాక రాక వచ్చిన ఆ విజయాన్ని అలా నిలుపుకోవాలన్న ప్రయత్నంతో పాటు, తదుపరి ప్రతిష్టాత్మకమైన పాతికో చిత్రం చేయాల్సి రావడంతో ఆచితూచి కథని ఎంచుకొన్నాడు ఎన్టీఆర్‌. సుకుమార్‌ '1' (నేనొక్కడినే)తో పరాజయాన్ని చవిచూసినప్పటికీ ఆయన తయారు చేసిన కథపై నమ్మకంతో ఓకే చెప్పేశాడు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎన్టీఆర్‌కి ఓ గుర్తుండిపోయే సినిమా ఇవ్వాలని సుకుమార్‌ కష్టపడుతున్నాడు. ఎన్టీఆర్‌ని ఒకకొత్త లుక్‌లో చూపించేందుకు ప్రయత్నిస్తున్నాడు.