Begin typing your search above and press return to search.

కత్తి మీద సామంటున్న రకుల్

By:  Tupaki Desk   |   7 Oct 2018 5:55 AM GMT
కత్తి మీద సామంటున్న రకుల్
X
ఏ ముహూర్తంలో ఎన్టీఆర్ బయోపిక్ ని తన చేతుల్లోకి తీసుకున్నాడో కానీ దర్శకుడు క్రిష్ పరుగులు పెట్టిస్తున్నాడు. రెండు భాగాలను ఒకే నెలలో విడుదల చేయడానికి డిసైడ్ అయిపోయి ప్రకటనలు కూడా ఇచ్చేసారు కాబట్టి షూటింగ్ శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే వదిలిన పోస్టర్లు లుక్స్ తో హైప్ ఎక్కడికో వెళ్లిపోయింది. దానికి తోడు కీలక పాత్రలకు పేరున్న ఆర్టిస్టులను తీసుకోవడమే కాదు వాళ్ళతో పరకాయ ప్రవేశం చేయించేలా తీర్చిదిద్దడంతో అంచనాలు పెరుగుతూ పోతున్నాయి.

ఇప్పుడు శ్రీదేవి వంతు వచ్చింది. అనూహ్యంగా కొద్దినెలల క్రితం దుర్మరణం పాలైన శ్రీదేవి పాత్రను రకుల్ ప్రీత్ సింగ్ ఎన్టీఆర్ లో చేస్తోంది. బడిపంతులులో ఎన్టీఆర్ మనవరాలిగా నటించి ఆ తర్వాత వేటగాడు లాంటి సూపర్ హిట్ సినిమాల్లో ఆయనకు హీరోయిన్ గా చేసిన శ్రీదేవి అంటే నందమూరి అభిమానులకు ప్రత్యేకమైన గౌరవం. అందుకే బాలకృష్ణ తన కెరీర్ లో ఒక్క శ్రీదేవితోనే జంటగా నటించలేదు.

ఇప్పుడు ఈ పాత్రను రకుల్ ఛాలెంజ్ గా ఫీలవుతోంది. లెజెండ్ గా భారతీయ సినిమాలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న శ్రీదేవి పాత్ర ఒక ఛాలెంజ్ అంటోంది. పరిశ్రమకు వచ్చి ఇన్నేళ్ళైనా శ్రీదేవిని కలిసే అవకాశం రకుల్ కు రాలేకపోవడం గమనార్హం. అందుకే శ్రీదేవి పాత సినిమాలు చూస్తూ ఆవిడ బాడీ లాంగ్వేజ్ ని ఆకళింపు చేసుకునే పనిలో ఉందట. మరికొద్ది రోజుల్లోనే సెట్స్ లో జాయిన్ కాబోతున్న రకుల్ బాలయ్య సరసన మొదటిసారి జంటగా కనిపించబోతోంది.

కాకపోతే శ్రీదేవి పాత్ర కేవలం మహానాయకుడులో మాత్రమే కనిపించనుంది. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్ళకముందు చేసిన చివరి సినిమాలు బొబ్బిలిపులి-వయ్యారి భామలు వగలమారి భర్తలులో శ్రీదేవీనే హీరోయిన్. కాబట్టి చెప్పుకోదగ్గ స్థాయిలోనే సన్నివేశాలు బిట్ సాంగ్స్ ఉంటాయని తెలిసింది.