Begin typing your search above and press return to search.

టీజర్ టాక్: దెయ్యంతో చెలగాటం

By:  Tupaki Desk   |   15 Sept 2019 11:45 AM IST
టీజర్ టాక్: దెయ్యంతో చెలగాటం
X
దర్శకుడిగా రాజు గారి గదితో తనకంటూ ఓ ఇమేజ్ ఏర్పరుచుకున్న ఓంకార్ అదే సిరీస్ లో తీస్తున్న కొత్త చిత్రం రాజు గారి గది 3. తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా ఉయ్యాలా జంపాలా ఫేమ్ అవికా గోర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం టీజర్ ఇందాక రిలీజ్ చేశారు. లైన్ చూచాయగా చెప్పే ప్రయత్నం చేశారు. అనగనగా ఓ పురాతన కోట. అక్కడ యక్షిణిని పాతేసి ఉంటారు. భయానక వాతావరణంలో అక్కడ ప్రతిదీ భీతి గొలిపేలా ఉంటుంది.

ఏదో రహస్యం కోసం వెళ్లిన వారికి(ఆలీ-ఊర్వశి )అక్కడో దెయ్యం(అవికా గోర్ )కనిపిస్తుంది. భయంతో వణికిపొతారు. మరోవైపు మాయ(అవికా గోర్)అనే అమ్మాయి చుట్టూ కొందరు వలయం పన్నుతారు. తనకు అండగా నిలుస్తాడు ఓ యువకుడు(అశ్విన్ బాబు). అతని విచిత్రమైన ప్రవర్తనకు కోటలోని దెయ్యానికి ఏదో సంబంధం ఉంటుంది. అదేంటో తెలుసుకోవాలి అంటే రాజు గారి గది 3 చూడాల్సిందే.

ఓంకార్ తనదైన స్టైల్ లో దీన్ని కూడా సీరియస్ హారర్ తో చూపిస్తూనే ఎంటర్ టైన్ చేసే ప్రయత్నం కనిపించింది . బ్యాక్ డ్రాప్ తో పాటు కథకు ఎంచుకున్న థీమ్ లో మరీ కొత్తదనం లేకపోయినా విజువల్స్ తో పాటు మేకింగ్ లో మంచి క్వాలిటీ చూపడం ఆసక్తి రేపెలా ఉంది. అవికా గొర్ వికృత దెయ్యం రూపంలో నిజంగానే భయపెట్టేలా ఉంది. పంచెకట్టుతో అశ్విన్ బాబుతో ఏదో డిఫరెంట్ గా ట్రై చేశాడు. కెమెరా వర్క్ తో పాటు సంగీతం కథలోని మూడ్ ని బాగా క్యారీ చేశాయి. హారర్ మూవీ లవర్స్ కి మంచి ఛాయస్ గా అనిపించే ఇంప్రెషన్ ఓంకార్ ఈ టీజర్ ద్వారా తెచ్చుకోగాలిగాడు. మరి రెండు భాగాలను మించి ఈ మూడో సిరీస్ సక్సెస్ అవుతుందా లేదా విడుదలయ్యాకే చూడాలి