Begin typing your search above and press return to search.

హీరోల ఫ్యాన్స్ మధ్య తీవ్ర గొడవ.. ఒకరు బలి!

By:  Tupaki Desk   |   24 April 2020 9:30 PM IST
హీరోల ఫ్యాన్స్ మధ్య తీవ్ర గొడవ.. ఒకరు బలి!
X
సౌత్ ఇండియాలో అభిమాన హీరోలను దైవాలుగా భావిస్తారు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ తమ అభిమాన నటుల కోసం ఫ్యాన్స్ మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా తమిళనాడులో ఇలాంటి సంఘటనలు మరీ ఎక్కువగా చోటుచేసుకుంటాయి. ఇలాంటి గొడవలు స్టార్ హీరోలు విజయ్ - అజిత్ - రజనీకాంత్ అభిమానుల మధ్య ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా తమిళనాడులో దారుణమైన సంఘటన జరిగింది. విజయ్ - రజనీకాంత్ అభిమానుల మధ్య గొడవ ఒకరి ప్రాణాన్ని బలిగొంది.

తాజా వివరాల ప్రకారం.. దినేష్ బాబు అనే యువకుడి రజనీకాంత్ కు వీరాభిమాని. యువరాజ్ అనే యువకుడు విజయ్ వీరాభిమాని. మొదటగా ఇద్దరి మధ్య రజని - విజయ్ ల గురించి సరదా గొడవ మొదలైంది. కరోనా నిర్మూలనకు ఈ హీరోలిద్దరూ ఇచ్చిన విరాళాల గురించి విజయ్ - దినేష్ బాబు మధ్య చర్చ జరిగింది. ఈ క్రమంలో మా హీరో అంటే మా హీరోనే గొప్ప అంటూ ఇద్దరూ వాదించుకున్నారు. కాసేపటికి వాదన కాస్త తీవ్రమై దినేష్ బాబు.. యువరాజ్ ని గట్టిగా తోసేసాడు.

కింద పడడంతో తలకు బలమైన గాయమై యువరాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దినేష్ బాబుని అదుపులోకి తీసుకున్నారట. గొడవ జరిగిన సమయంలో స్నేహితులిద్దరూ మద్యం సేవించి ఉన్నట్లు సమాచారం. హీరోల కోసం ఫ్యాన్స్ కొట్టుకొని చావడం ఘోరమంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.