Begin typing your search above and press return to search.

అదీ.. సూపర్‌ స్టార్‌ కమిట్‌మెంట్‌

By:  Tupaki Desk   |   3 July 2015 5:30 PM GMT
అదీ.. సూపర్‌ స్టార్‌ కమిట్‌మెంట్‌
X
ఎప్పుడూ రజినీకాంత్‌ స్టయిల్‌ గురించే మాట్లాడుకుంటాం. కానీ ఆయనెంత మంచి నటుడు అన్నది మాత్రం జనాలు పెద్దగా పట్టించుకోరు. రోబో సినిమాలో చిట్టి పాత్రలో ఇంకెవరినైనా ఊహించుకోగలమా అసలు? నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న ఆ క్యారెక్టర్‌ను ఇంకో నటుడెవరైనా అంత బాగా రక్తి కట్టించేవాడా? రజినీ అంటే స్టయిలే అన్న ముద్ర పడిపోవడంతో ఆయన యాక్టింగ్‌ స్కిల్స్‌ గురించి ఎప్పుడూ పెద్దగా చర్చ జరగదు. ఐతే రజినీతో కలిసి పని చేసే దర్శకులకు తెలుసు.. ఆయనెంత మంచి నటుడో, ఆయన కమిట్‌మెంట్‌ ఏంటో!

ఇప్పుడు రజినీతో సినిమా చేయబోతున్న యువ దర్శకుడు రంజిత్‌.. ఇందులో నటించే నటీనటుల కోసం ఓ వర్క్‌షాప్‌ పెట్టాడట. ఐతే రజినీకి మనమేం నేర్పిస్తాం.. ఆయన అనుభవం ముందు మనమెంత అన్న అభిప్రాయంతో ఈ వర్క్‌షాప్‌కు రజినీని మాత్రం పిలవలేదట రంజిత్‌. కానీ రజినీకాంత్‌ ఊరుకుంటాడా? వర్క్‌ షాప్‌ రెండో రోజు సడెన్‌గా అక్కడ ప్రత్యక్షమైపోయాడు. నాకు మాత్రం ఎందుకు మినహాయింపునిచ్చారు? మీ ఆలోచనలకు తగ్గట్లు నటిస్తానో లేదో ఓసారి చూసుకోండి అంటూ.. సన్నివేశాలకు తగ్గట్లు నటించి చూపించడం మొదలుపెట్టారట రజినీ. తప్పులేమైనా ఉంటే చెప్పమన్నారట. రంజిత్‌ తీసింది రెండు సినిమాలే. అయినా ఓ డైరెక్టర్‌కు రజినీ ఇచ్చిన విలువ చూసి.. కమిట్‌మెంట్‌ విషయంలో రజినీ తర్వాతే ఎవరైనా అనుకున్నారట యూనిట్‌ సభ్యులంతా. రజినీ, రంజిత్‌ల సినిమా ఆగస్టులో సెట్స్‌ మీదికి వెళ్లనుంది. ఇందులో సూపర్‌ స్టార్‌ మాఫియా డాన్‌ పాత్ర చేస్తున్నట్లు సమాచారం.