Begin typing your search above and press return to search.

రజనీకాంత్‌కు విలన్ల సమస్య!!

By:  Tupaki Desk   |   7 July 2015 6:51 AM GMT
రజనీకాంత్‌కు విలన్ల సమస్య!!
X
బాహుబలి కోసం దాదాపు అరడజను మంది స్టార్లు రెండున్నరేళ్ల పాటు అడ్డంగా బుక్కయ్యారు. ఇలాంటి వార్‌ ఎపిక్‌ సినిమా కోసం ఎంతో సమయం వెచ్చించి శ్రమించాల్సి ఉంటుంది కాబట్టి ఇది తప్పదు. అయితే ఇదే తీరుగా సంవత్సరాల కొద్దీ సమయం వెచ్చించి భారీ సినిమాలు తీయడం శంకర్‌కి అలవాటు. అతడు ఏ సినిమా తీసినా బల్క్‌గా ఏడాదిన్నరకు పైగానే కాల్షీట్లు కేటాయించాలి. అయితే అంత సమయం వృధా చేసుకోవడానికి ఏ స్టార్‌ ఇష్టపడరు.

సరిగ్గా ఇదే సమస్య ఇప్పుడు రజనీ హీరోగా శంకర్‌ తెరకెక్కించే రోబో -2కి పెద్ద అడ్డంకిగా మారింది. ఈ సినిమాలో విలన్‌ పాత్ర అత్యంత కీలకమైనది. సూపర్‌స్టార్‌ రజనీతో పోటీపడి నటించే ప్రాముఖ్యత ఉన్న పాత్ర ఇది. అందుకే బాలీవుడ్‌ సూపర్‌స్టార్లు షారూక్‌ఖాన్‌, అమీర్‌ఖాన్‌ వంటి వారిని సంప్రదించాడు. కానీ ఎవరూ ముందుకు రాలేదు. భారీగా కాల్షీట్లు ఇచ్చేంత తీరిక లేదు ఎవరికీ. ఒకవేళ ఉన్నా ఉత్తరాది హీరోలు దక్షిణాది దర్శకుడిని ఎంకరేజ్‌ చేసే సీనే లేదు. అందుకే మళ్లీ మరోసారి శంకర్‌ తను ఎంతో నమ్మే విక్రమ్‌ చెంతకే చేరాడు. రోబో2 లో విలన్‌గా నటించాల్సిందిగా విక్రమ్‌ని కోరాడు.

కానీ విక్రమ్‌లోనూ అపరిచితుడున్నాడు. అతడు కూడా రెండు మూడేళ్లకు సరిపడా బుక్కయిపోయి ఉన్నాడు. కాల్షీట్లు కేటాయించలేని దుస్థితి. అందుకే ఎటూ పాలుపోని పరిస్థితిలో శంకర్‌ పడిపోయాడని కోలీవుడ్‌లో అనుకుంటున్నారు. మొత్తానికి రజనీకి హీరోలంతా హ్యాండిచ్చారన్నమాట!