Begin typing your search above and press return to search.

రజినీ-కమల్.. ఒకే వేదికపైకి

By:  Tupaki Desk   |   5 Jan 2018 2:14 PM IST
రజినీ-కమల్.. ఒకే వేదికపైకి
X
తమిళనాట ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా రజినీకాంత్ రాజకీయ అరంగేట్రం గురించే మాట్లాడుకుంటున్నారు. రెండు దశాబ్దాల సందిగ్ధతకు తెరదించుతూ కొన్ని రోజుల కిందటే తన రాజకీయ రంగ ప్రవేశం గురించి ప్రకటన చేసేశాడు రజినీ. ఇప్పటికే మరో అగ్ర నటుడు కమల్ హాసన్ సైతం తాను కూడా రాజకీయాల్లోకి రానున్నట్లు ప్రకటించాడు. మరి ఈ ఇద్దరు మిత్రులు రాజకీయాల్లోనూ స్నేహాన్ని కొనసాగిస్తారా.. లేక ప్రత్యర్థులుగా మారుతారా అన్న దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ చర్చ ఇలా ఉండగానే వీళ్లిద్దరూ ఒకే వేదికపైకి రాబోతుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది.

శనివారం నుంచి రెండు రోజుల పాటు మలేషియాలో నడిగర్ సంఘం స్టార్ నైట్ జరగబోతున్న సంగతి తెలిసిందే. సంఘానికి భవనం నిర్మించేందుకు నిధులు సమీకరించడం కోసం భారీ ఎత్తున ఈ వేడుకలు చేస్తున్నారు. ఇందులో భాగంగా అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దీనికి 200 మందికి పైగా ఆర్టిస్టులు హాజరవుతున్నారు. తమిళ సినీ పరిశ్రమకు రెండు కళ్లు అనదగ్గ రజినీ.. కమల్ కూడా ఈ వేడుకల్లో పాల్గొనబోతున్నారు. రజినీ చెన్నై నుంచి శుక్రవారం రాత్రి ప్రత్యేక విమానంలో మలేషియాకు వెళ్తుండగా.. ప్రస్తుతం అమెరికాలో ఉన్న కమల్.. అట్నుంచి అటే మలేషియాకు రాబోతున్నాడు. మరి రజినీ రాజకీయారంగేట్ర ప్రకటన తర్వాత ఆయన కమల్ తో కలిసి ఒకే వేదిక పంచుకోబోతుండటంతో వీళ్లిద్దరి కెమిస్ట్రీ ఎలా ఉంటుంది.. ఒకరి గురించి ఇంకొకరు ఏం మాట్లాడతారని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.