Begin typing your search above and press return to search.

అమీర్ అడిగితే రజినీ చేయనన్నాడు

By:  Tupaki Desk   |   10 Dec 2016 6:48 AM GMT
అమీర్ అడిగితే రజినీ చేయనన్నాడు
X
ఆమిర్ ఖాన్ సినిమా అంటే.. కేవలం హిందీ ప్రేక్షకులు మాత్రమే కాదు.. వేరే భాషల వాళ్లు కూడా ఆసక్తి చూపిస్తారు. గత కొన్నేళ్లలో అద్భుతమైన సినిమాలు చేసి.. తన ఇమేజ్ ను బాగా పెంచుకున్న ఆమిర్.. సౌత్ ఇండియాలో కూడా బాగా పాపులర్ అయ్యాడు. అతడి సినిమాల్ని ప్రాంతీయ భాషల్లోకి కూడా అనువాదం చేసి.. మంచి వసూళ్లు రాబట్టుకుంటున్నారు బాలీవుడ్ నిర్మాతలు. అందులోనూ ఆమిర్ కొత్త సినిమా ‘దంగల్’ మీద సౌత్ ఇండియాలో సైతం భారీ అంచనాలున్నాయి. తెలుగు.. తమిళ భాషల్లోనూ ఈ చిత్రాన్ని అనువాదం చేసి రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ భాషల్లో ట్రైలర్లు కూడా వచ్చాయి. డిసెంబరు 23న ఈ సినిమాను రెండు భాషల్లో పెద్ద ఎత్తునే రిలీజ్ చేస్తున్నారు.

ఐతే ఎందుకనిపించిందో ఏమో కానీ.. ఆమిర్ ఖాన్ తన సినిమాకు తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ వాయిస్ ఇస్తే బాగుంటుందనిపించిందట. ఆయనే స్వయంగా రజినీని ఈ సాయం అడిగారట. కానీ రజినీ ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. ఆమిర్ అంతటి వాడు అడిగినా రజినీ ఒప్పుకోకపోవడం ఆశ్చర్యమే. హిందీ సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో.. కర్ణాటకలో ఆడినంతగా తమిళనాట ఆడవు. ఐతే ఈ మధ్య కొంచెం పరిస్థితి మారుతోంది. అక్కడ బాలీవుడ్ సినిమాలకు కలెక్షన్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తన మార్కెట్ మరింత పెంచుకోవడానికి.. ‘దంగల్’ సినిమాను తమిళ ప్రేక్షకులకు మరింత చేరువ చేయడానికి ఆమిర్.. సూపర్ స్టార్ సాయం కోరినట్లున్నాడు.