Begin typing your search above and press return to search.

రజనీ మార్కెట్.. సగం చేసి పెట్టాడుగా

By:  Tupaki Desk   |   2 Jan 2019 3:48 PM IST
రజనీ మార్కెట్.. సగం చేసి పెట్టాడుగా
X
సూపర్ స్టార్ రజనీకాంత్ కు తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ ఉందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడి స్టార్ హీరోల సినిమాలకు సమాన స్థాయిలో విడుదలవుతుంటాయి ఆయన సినిమాలు. రజనీ సినిమా హక్కుల కోసం విపరీతమైన పోటీ ఉంటుంది. టికెట్ల కోసం డిమాండ్ మామూలుగా ఉండదు. నాలుగేళ్ల కిందటే రజనీ సినిమా తెలుగు డబ్బింగ్ హక్కులు రూ.30 కోట్లు దాటాయంటే ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో ఏ స్థాయి మార్కెట్ సంపాదించుకున్నాడో అర్థం చేసుకోవచ్చు.

ఐతే రజనీ ఇక్కడ తన మార్కెట్ ను తానే దెబ్బ తీసుకున్నాడు. ఒక దర్శకుడిని అతిగా నమ్మడమే అందుక్కారణం. పా.రంజిత్ అనే యువ దర్శకుడితో ఆయన చేసిన ‘కబాలి’కి మంచి హైప్ వచ్చింది. ఆ చిత్ర హక్కులు దాదాపు రూ.32 కోట్లకు అమ్ముడయ్యాయి. కానీ ఆ సినిమా ప్రేక్షకుల్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. ఆ దెబ్బ సరిపోదని సూపర్ స్టార్ మళ్లీ అతడితోనే జట్టు కట్టాడు. వీళ్ల కాంబినేషన్లో వచ్చిన ‘కాలా’కు అసలు తెలుగులో డిమాండే లేకపోయింది. బయ్యర్లు లేక సొంతంగా రిలీజ్ చేసుకుంటే రూ.10 కోట్లు కూడా రాలేదు. ‘2.0’ రేంజ్ వేరు.. అది స్పెషల్ మూవీ కాబట్టి దాని లెక్కల గురించి ఇక్కడ మాట్లాడకూడదు. ఇక రజనీ కొత్త సినిమా ‘పేట్ట’ విషయానికి వస్తే దాని హక్కులు రూ.15 కోట్లకు అటు ఇటుగా అమ్ముడైనట్లు సమాచారం. ఐదేళ్ల కిందటే ‘లింగ’ హక్కులు రూ.30 కోట్లు పలకగా.. ఇప్పుడు అందులో సగానికి రజనీ మార్కెట్ పడిపోవడం ఆశ్చర్యకరం. ఇందుకు ఒక రకంగా కారణం పా.రంజిత్ అనే చెప్పాలి. అతను తీసిన సినిమాల వల్లే రజనీపై తెలుగు ప్రేక్షకులకు ఒక రకమైన వ్యతిరేక భావం ఏర్పడింది. ఆయన మార్కెట్ మీద బాగా ప్రభావం చూపింది. మరి సంక్రాంతికి భారీ తెలుగు చిత్రాలకు పోటీగా రిలీజవుతున్న ‘పేట’ రూ.15 కోట్ల పెట్టుబడి అయినా వెనక్కి తెచ్చి ఈ మాత్రం మార్కెట్ అయినా నిలబెడుతుందో లేదో చూడాలి.