Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్ 'లాల్ సలామ్'

By:  Tupaki Desk   |   5 Nov 2022 6:19 AM GMT
సూపర్ స్టార్ లాల్ సలామ్
X
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల లైకా ప్రొడక్షన్స్ సంస్థతో రెండు ప్రాజెక్ట్స్ కోసం తలైవర్ సైన్ చేసారు. అందులో ఒకటి తండ్రీకూతుళ్ల కాంబినేషన్ లో ఉంటుందని అందరూ ఫిక్స్ అయ్యారు. వాటిని నిజం చేస్తూ తాజాగా ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించారు.

ఐశ్వర్య దర్శకత్వంలో రజినీకాంత్ నటించబోయే ఈ చిత్రానికి ''లాల్ సలామ్'' అనే పవర్ ఫుల్ టైటిల్ ని ఖరారు చేసారు. అయితే ఇందులో రజినీది ఫుల్ లెన్త్ రోల్ కాదు. స్పెషల్ అప్పీయరెన్స్ మాత్రమే. తమిళ్ హీరోలు విష్ణు విశాల్ మరియు విక్రాంత్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వాళ్ళిద్దరికీ సపోర్ట్ గా క్యామియో రోల్ లో తలైవర్ కనిపించనున్నారు. గెస్ట్ రోల్ అయినప్పటికీ అది కథలో చాలా కీలమైన పాత్ర అని సమాచారం.

''లాల్ సలామ్'' ఈ చిత్రాన్ని ఈరోజు శనివారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంట్రెస్టింగ్ టైటిల్ పోస్టర్ ని ఆవిష్కరించారు. ఇందులో తగలబడుతున్న హెల్మెట్ - రక్తం మరకలతో ఉన్న క్రికెట్ బ్యాట్ - గ్లోవ్స్ - బాల్ మరియు బెయిల్ ని మనం గమనించవచ్చు. ఈ పోస్టర్ ని బట్టి క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉంటుందని స్పష్టం అవుతోంది. అందుకే క్రికెట్ లో ప్రావీణ్యం ఉన్న విష్ణు విశాల్ మరియు విక్రాంత్ లను లీడ్ రోల్స్ లో తీసుకున్నట్లు తెలుస్తోంది.

'లాల్ సలామ్' చిత్రానికి ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చనున్నారు. విష్ణు రంగస్వామీ సినిమాటోగ్రఫీ నిర్వహించనున్నారు. సుభాస్కరన్ సమర్పణలో లైకా ప్రొడక్షన్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందనుంది. జీవీకే తమిళ్ కుమారన్ నిర్మాణంలో భాగం అవుతున్నారని తెలుస్తోంది. 2023 లోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

రజిని కాంత్ ప్రస్తుతం 'డాక్టర్' ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో "జైలర్" అనే యాక్షన్ డ్రామాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సన్‌ పిక్చర్ బ్యానర్ లో కళానిది మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో తమిళ న్యూ ఇయర్ కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. దీని తర్వాత లైకా బ్యానర్ లో 'డాన్' ఫేమ్ శిబి చక్రవర్తి దర్శకత్వంలో రజినీ కాంత్ ఓ సినిమా చేయనున్నట్లు టాక్. ఈ ప్రాజెక్ట్ ని కూడా ఈరోజే లాంచ్ చేసే అవకాశం ఉంది.

ఇప్పుడు తన కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్షన్ లో 'లాల్ సలామ్' సినిమాలో తలైవా కీలక పాత్ర పోషిస్తున్నారు. '3' చిత్రంతో డైరెక్టర్ గా పరిచయమైన ఐశ్వర్య.. ఆ తర్వాత 'వాయ్ రాజా వాయ్' అనే సినిమాని తెరకెక్కించింది. అలానే రజినీ కాంత్ వాయిస్ ఓవర్ తో 'సినిమా వీరన్' అనే డాక్యుమెంటరీని రూపొందించింది. ఇదే క్రమంలో తొలిసారిగా తన తండ్రిని డైరెక్ట్ చేయడానికి సిద్ధమైంది. అయితే రజినీ ఫుల్ లెన్త్ రోల్ చేయకుండా.. 'లాల్ సలామ్' చిత్రంలో అతిథి పాత్ర చేస్తుండటంపై ఫ్యాన్స్ హ్యాపీగా లేరని సోషల్ మీడియాలో కామెంట్స్ ని బట్టి తెలుస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.