Begin typing your search above and press return to search.

సినిమాని చంపేశారు.. నాకు అన్యాయం చేశారు: 'శేఖర్' నిర్మాత

By:  Tupaki Desk   |   24 May 2022 11:30 AM GMT
సినిమాని చంపేశారు.. నాకు అన్యాయం చేశారు: శేఖర్ నిర్మాత
X
సీనియర్ హీరో, యాంగ్రీ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్ ప్రధాన పాత్రలో ఆయన సతీమణి జీవిత రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ''శేఖర్''. వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పణలో బీరం సుధాకర్ రెడ్డి ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ని నిర్మించారు. గత శుక్రవారం మే 20న విడుదలైన ఈ సినిమా వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.

నిర్మాత, దర్శకురాలు జీవిత రాజశేఖర్ తనకు ఇవ్వాల్సిన డబ్బులు తిరిగి ఇవ్వడం లేదంటూ పరంధామరెడ్డి అనే ఫైనాన్షియర్ హైదరాబాద్ లోని సిటీ సివిల్ కోర్టులో వేసిన కేసు కారణంగా ''శేఖర్'' సినిమా ప్రదర్శన నిలిచిపోయింది. దీంతో మేకర్స్ పై పెద్ద దెబ్బ పడింది. ఈ వివాదం పై సోమవారం న్యాయస్థానంలో వాదనలు జరిగాయి.

అయితే 'శేఖర్' సినిమాను నిలిపివేయాలని తాము చెప్పలేదని ఈ సందర్భంగా కోర్టు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో న్యాయస్థానం చెప్పకుండానే సినిమా ప్రదర్శన ఆపేయడం పై నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం మీడియా సమావేశం నిర్వహించి ఈ సినిమా వివాదంపై స్పందించారు.

ఈ సందర్భంగా బీరం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ..'శేఖర్ సినిమా టైటిల్ మొదలుకొని ల్యాబ్ అగ్రిమెంట్ వరకు అన్నీ నా పేరు మీదే ఉంటాయి. సెన్సార్ సర్టిఫికేట్ సైతం నిర్మాతగా నా పేరు మీద వచ్చింది. శివాని శివాత్మిక పేర్లు వారు ఇష్టపడి వేసుకున్నారు. లీగల్ మాత్రం అన్నీ నా పేరు పైనే ఉన్నాయి. సినిమా ప్రదర్శనను కోర్టు చెప్పలేదు. సినిమా రైట్స్ ఎటాచ్మెంట్ చేయమని మాత్రమే చెప్పింది. అయినా క్యూబ్ - యుఎఫ్ఓలు ప్రదర్శనలు ఆపి నాకు అన్యాయం చేశాయి'' అని ఆవేదన వ్యక్తం చేశారు.

'గరుడ వేగ' సినిమాకు నేను ఫైనాన్సియర్ ని. జీవితా రాజశేఖర్ మరియు ఆ చిత్ర నిర్మాతలకు మధ్య జరిగింది ఏమిటనేది నాకు అనవసరం. ఇప్పుడు నాకు జరిగిన అన్యాయంపై ఎవరు బాధ్యత వహిస్తారనే దానిపై లీగల్ చర్యలకు సిద్ధమవుతాను అని 'శేఖర్' నిర్మాత పేర్కొన్నారు.

''మళ్లీ 'శేఖర్' సినిమా ప్రదర్శనలపై నేను నిర్ణయం తీసుకోలేదు. ఈ సినిమాకు నేను రూ. 15 కోట్ల ఇన్వెస్ట్ చేశాను. ఆల్రెడీ ప్రదర్శన ఆపేసి సినిమాను చంపేశారు. నాకు డిజిటల్ పార్టనర్స్ మరియు పరంధామ రెడ్డి వల్ల జరిగిన నష్టంపై స్పష్టత వచ్చిన తర్వాతే 'శేఖర్' చిత్రాన్ని ఓటీటీకి ఇచ్చే విషయం పై ఆలోచిస్తాను. నేను అసలు ఏం తప్పు చేశాను.. నా సినిమాకు ఇలా ఎందుకు చేశారు.. ఆర్డర్ వచ్చిన తర్వాత డైరెక్ట్ గా వెళ్లి వాళ్ళను కలిసి ఈ విషయాన్ని అడగాలని ఉంది" అని సుధాకర్ రెడ్డి అన్నారు.

ఇలాంటి ఇష్యూస్ వల్ల నేనొక్కడినే బలి కాలేదు. ఆల్రెడీ చాలామంది సఫర్ అయ్యారు. వాళ్లంతా సినిమా రిలీజ్ అవ్వకముందు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.. కానీ సినిమా విడుదలైన. రెండు రోజుల తర్వాత ఆపేయడం వల్ల నేను ఇప్పుడు సఫర్ అవుతున్నా. అందరూ మానవత్వంతో ఆలోచించండి. ఇది రాజశేఖర్ సినిమా కాదు. రాజశేఖర్ నటించిన సినిమా.. జీవిత డైరెక్ట్ చేసిన చిత్రం. వాళ్లకు ప్రొడక్షన్ హౌస్ కు సంబంధం లేదు. కోర్టు ఆర్డర్ అంటూ నా సినిమాని ఆపేయడం ఎంతవరకు సమంజసం'' అని నిర్మాత ప్రశ్నించారు.

ఈ సందర్భంగా 'శేఖర్' నిర్మాత తరపు అడ్వకేట్ రతన్ సింగ్ మాట్లాడుతూ.. కోర్టు ఈ సినిమా ప్రదర్శన నిలిపివేయాలని చెప్పలేదు. సినిమా ప్రొజెక్షన్ ఆపటం అనేది ఇల్లీగల్ అవుతుంది. డిజిటల్ పార్ట్నర్స్ వల్ల నా క్లయింట్ కు నష్టం వాటిల్లింది. ఇప్పటికే వారికి లీగల్ నోటీసులు ఇచ్చాం. వారు దానికి సమాధానం చెప్పాలి. 'శేఖర్' సినిమా ప్రదర్శనల ద్వారా వచ్చిన రూ. 65 లక్షలను సపరేట్ అకౌంటులో సెక్యూరిటీ డిపాజిట్ చేయమని కోర్టు చెప్పిందని తెలిపారు.