Begin typing your search above and press return to search.

గోపీచంద్ సినిమాలో విలన్ గా రాజశేఖర్?

By:  Tupaki Desk   |   7 Aug 2021 3:39 AM GMT
గోపీచంద్ సినిమాలో విలన్ గా రాజశేఖర్?
X
కెరియర్ ఆరంభంలో నెగెటివ్ టచ్ ఉన్న పాత్రలను చేసి, ఆ తరువాత హీరోగా రాణించిన అతి తక్కువ మంది కథానాయకులలో రాజశేఖర్ ఒకరు. అలాగే ఒక వైపున యాక్షన్ హీరోగా తిరుగులేదనిపించుకుంటూనే, మరో వైపున రొమాంటిక్ హీరోగా ఆయన మార్కులు కొట్టేశారు. తెలుగులో గట్టిపోటీ ఉన్నప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ ను సెట్ చేసుకుని, మిగతా వాళ్లకి భిన్నమైన జోనర్లో సినిమాలు చేస్తూ వెళ్లారు. పవర్ఫుల్ పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ .. రాజశేఖర్ అనిపించుకున్నారు. పాత్రలపై తనదైన ముద్రవేస్తూ సుదీర్ఘకాలంగా కెరియర్ ను కొనసాగిస్తూ వస్తున్నారు.

అయితే ఇక్కడ పరాజయాలను గతంలో సాధించిన విజయాలతో కవర్ చేయడానికి కుదరదు. ఏ సినిమాకు ఆ సినిమానే ఒక పరీక్షలాంటిది. ఆ సినిమా హిట్ ఇస్తే మరో సినిమా ఉంటుంది .. లేదంటే రేసులో నుంచి బయటికి పంపిస్తుంది. అప్పటికే కాస్త కూడబెట్టుకున్నవాళ్లయితే కొంతకాలం పాటు నిలబడగలుగుతారు. మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోగలుగుతారు. సహజంగానే ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవలసి వస్తూనే ఉంటుంది. అది రాజశేఖర్ కి కూడా తప్పలేదు.

హీరోగా వరుస పరాజయాలు ఎదురవుతూ ఉండటంతో, రాజశేఖర్ విలన్ గా టర్న్ తీసుకోవాలనుకున్నారు. అందుకు సంబంధించిన సంకేతాలను పంపించారు. దాంతో కొంతమంది దర్శక నిర్మాతలు ఆయనతో సంప్రదింపులు కూడా జరిపారు. అయితే విలన్ గా తన ఎంట్రీ ఒక రేంజ్ లో ఉండాలని రాజశేఖర్ భావిస్తున్నారు. ఆ రేంజ్ కి తగిన విధంగా లేకపోవడం వలన కొన్ని విలన్ పాత్రలను ఆయన వదులుకోవలసి వచ్చింది. ప్రస్తుతం ఆయన హీరోగా వరుస సినిమాలు చేస్తూనే, విలన్ పాత్రల కోసం వెయిట్ చేస్తున్నారు.

తాజాగా దర్శకుడు శ్రీవాస్ తన సినిమాలో విలన్ పాత్ర కోసం రాజశేఖర్ ను సంప్రదించినట్టుగా వార్తలు వస్తున్నాయి. 'లక్ష్యం' .. 'లౌక్యం' .. 'డిక్టేటర్' వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీవాస్,  ప్రస్తుతం హీరో గోపీచంద్ తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ విలన్ పాత్ర ఉందట. దానికోసమే ఆయన  రాజశేఖర్ ను కలిసినట్టుగా చెప్పుకుంటున్నారు. కథ .. తన పాత్ర గురించిన విన్న రాజశేఖర్, గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి.