Begin typing your search above and press return to search.

రాజశేఖర్-జీవిత.. ఎన్నాళ్లకెన్నాళ్లకు..

By:  Tupaki Desk   |   5 Aug 2021 6:24 AM GMT
రాజశేఖర్-జీవిత.. ఎన్నాళ్లకెన్నాళ్లకు..
X
టాలీవుడ్లో ఒకప్పుడు టాప్ స్టార్లలో ఒకరిగా ఉన్నారు సీనియర్ హీరో రాజశేఖర్. ఐతే 90వ దశకం చివరి నుంచి ఆయన హవా తగ్గుతూ వచ్చింది. గత రెండు దశాబ్దాల్లో చాలా స్ట్రగులయ్యారు. మధ్యలో ఇండస్ట్రీ నుంచి అంతర్ధానం అయిపోతున్న దశలో ‘గరుడ వేగ’తో కాస్త ఉపశమనం పొందారు. తర్వాత ‘కల్కి’తో మళ్లీ బోల్తా కొట్టారు.

కెరీర్లో మళ్లీ గ్యాప్ వచ్చింది. కొంత కాలం ఆయన వార్తల్లో లేరు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)కు సంబంధించిన ఓ సన్నివేశంలో వివాదం తర్వాత రాజశేఖరే కాదు.. ఆయన భార్య జీవిత సైతం వార్తల్లో లేకుండా పోయారు. బయట కనిపించడమే మానేశారు.

మధ్యలో రాజశేఖర్‌కు కరోనా సోకి ఆయన పరిస్థితి విషమించినపుడు ఆయన గురించి చర్చ జరిగింది. ఆపై స్వల్ప వ్యవధిలో రాజశేఖర్ హీరోగా మూడు చిత్రాలు అనౌన్స్ చేయడం తెలిసిందే. కానీ రాజశేఖర్ కానీ, జీవిత కానీ బయట మాత్రం కనిపించలేదు. ‘మా’ ఎన్నికల్లో జీవిత అధ్యక్షురాలిగా పోటీ చేస్తుందని వార్తలొచ్చాయి కానీ.. ఆమె వాటి గురించి స్పందించలేదు. ఐతే ఎట్టకేలకు ఈ దంపతులిద్దరూ ఓ సినీ వేడుకలో కనిపించారు.

ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు రాజశేఖర్, జీవిత ముఖ్య అతిథులుగా రావడం విశేషం. ఈ సినిమాతో ఏ కనెక్షన్ లేకపోయినా.. వీళ్లిద్దరూ అతిథులుగా రావడం విశేషమే. తన కొత్త చిత్రం ‘శేఖర్’లో నడి వయస్కుడిగా తెల్లటి గడ్డంతో కనిపించనున్న రాజశేఖర్ ఆ లుక్‌తోనే ఈ వేడుకకు వచ్చారు.

ఇలా ఆయన బయటెప్పుడూ కనిపించిందవి లేదు. కరోనా కష్ట కాలంలో సినిమా తీసి రిలీజ్ చేస్తున్న చిత్ర బృందానికి అభినందనలని, ఈ సినిమా పెద్ద హిట్టవ్వాలని కోరుకుంటున్నానని రాజశేఖర్ అన్నారు. జీవిత మాట్లాడుతూ.. ఈ సినిమాలో ‘చుక్కల చిన్ని’ అనే పాటను రాజశేఖర్ రోజూ వింటారని.. ఈ సినిమా పెద్ద హిట్టయి ఇండస్ట్రీకి ఊపిరి పోయాలని ఆశిస్తున్నానని అన్నారు.