Begin typing your search above and press return to search.

రంగస్థలం ప్రెసిడెంట్ రోల్ ఆఫర్ చెయ్యలేదట!

By:  Tupaki Desk   |   26 Jun 2019 6:39 AM GMT
రంగస్థలం ప్రెసిడెంట్ రోల్ ఆఫర్ చెయ్యలేదట!
X
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ తాజా చిత్రం 'కల్కి' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ థ్రిల్లర్ ను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇప్పటికే టీమ్ రిలీజ్ చేసిన ఇంట్రెస్టింగ్ ప్రోమోస్ తో 'కల్కి' పై పాజిటివ్ బజ్ నెలకొంది. 'కల్కి' టీమ్ కూడా జోరుగా ప్రమోషన్స్ లో పాల్గొంటూ సినిమాపై హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో రాజశేఖర్ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపాడు.

'గరుడవేగ' సినిమా రిలీజ్ కు ముందు రాజశేఖర్ కు కొంచెం గ్యాప్ వచ్చింది. ఆ సమయంలో రాజశేఖర్ విలన్ పాత్రలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారని వార్తలు వచ్చాయి. రామ్ చరణ్ సినిమాలో రాజశేఖర్ కు విలన్ పాత్ర ఆఫర్ చేసినట్టుగా ప్రచారం సాగింది. 'రంగస్థలం' లో జగపతి బాబు పోషించిన ప్రెసిడెంట్ గారు పాత్రను మొదట రాజశేఖర్ కు ఆఫర్ చేశారని అన్నారు. ఈ విషయంపై స్పందిస్తూ రాజశేఖర్ తనకు ఆ పాత్ర ఆఫర్ రాలేదని స్పష్టం చేశారు. అయితే జగపతి బాబు ఆ పాత్రను అద్భుతంగా పోషించారని మెచ్చుకున్నారు.

'కల్కి' గురించి మాట్లాడుతూ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు. ఈ జెనరేషన్ ఆడియన్స్ టేస్ట్ కు తగ్గట్టుగా ప్రశాంత్ వర్మ 'కల్కి' ని రూపొందించాడని అన్నారు. ఈ సినిమాలో రాజశేఖర్ కు జోడీగా అదా శర్మ నటిస్తోంది. నందితా శ్వేత.. పూజిత పొన్నాడ.. రాహుల్ రామకృష్ణ.. నాజర్.. అశోతోష్ రాణా.. శత్రు ఇతర కీలకపాత్రల్లో నటించారు. ఈ సినిమాను సీ. కళ్యాణ్.. శివాని.. శివాత్మిక నిర్మిస్తున్నారు.