Begin typing your search above and press return to search.

తమిళ హీరోల్లా మాట్లాడుతున్న జక్కన్న

By:  Tupaki Desk   |   9 July 2015 12:40 PM IST
తమిళ హీరోల్లా మాట్లాడుతున్న జక్కన్న
X
రోమ్‌లో రోమన్‌లా ఉండాలంటారు. ఈ విషయంలో తమిళ హీరోలే మనకు స్ఫూర్తి. తమ సినిమా అనువాదమై తెలుగులో విడుదలవుతున్నపుడు హైదరాబాద్‌ వస్తే.. అందరిదీ ఒకటే మాట. త్వరలోనే తెలుగులో సినిమా చేస్తున్నా అనేస్తారు. ఈ ఏడాదే ఆ సినిమా మొదలువుతంది అని కూడా చెబుతారు. కానీ ఇలా ఏళ్లు గడిచిపోతుంటాయి. కానీ సినిమా మొదలవదు. మన రాజమౌళి కూడా 'బాహుబలి' ప్రమోషన్స్‌లో భాగంగా ఇలాంటి మాటలే చెబుతున్నట్లున్నాడు. బాలీవుడ్‌లో సినిమాలు తీసే ఉద్దేశముందా అని ఇక్కడ అడిగితే.. అలాంటి ఉద్దేశాలేమీ లేవన్నాడు కానీ.. ముంబయిలో 'బాహుబలి' ప్రమోషన్స్‌లో మాత్రం బాలీవుడ్‌ సినిమా చేస్తా అని మాటిచ్చేశాడు.

''నేను ఎప్పట్నుంచో ఓ హిందీ సినిమా చేయాలనుకుంటున్నా. తెలుగులో సినిమాలే నాకు ముఖ్యం అని చెబితే అది అబద్ధమే అవుతుంది. ఏ దర్శకుడైనా ఎక్కువమంది ప్రేక్షకులకు చేరువ కావాలని కోరుకుంటాడు. బాలీవుడ్‌లో ఆ అవకాశం పుష్కలంగా ఉంటుంది. అయితే వచ్చే ఏడాది కూడా నాకు బాహుబలితోనే సరిపోతుంది. వేరే సినిమాల గురించి ఆలోచించే ప్రసక్తే లేదు'' అని చెప్పాడు రాజమౌళి. ఐతే వచ్చే ఏడాది వరకు బాహుబలితో సరిపోతే.. ఇంకో ఏడాదిన్నర మహేష్‌ సినిమా కోసం పెట్టాలి. ఆ తర్వాత ఎన్టీఆర్‌ ఎప్పట్నుంచో వెయిటింగ్‌లో ఉన్నాడు కాబట్టి అతడి సినిమా చేయాలి. ఇంకా బాలయ్య కొడుకు మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేయాలన్న ఆబ్లిగేషన్‌ కూడా ఉంది. మరి ఇన్ని కమిట్‌మెంట్లు పెట్టుకుని బాలీవుడ్‌లో సినిమా చేస్తానని హామీ ఇచ్చేశాడు జక్కన్న.