Begin typing your search above and press return to search.

జక్కన్న ట్వీట్ యాపారం బాగుందే

By:  Tupaki Desk   |   8 July 2017 5:48 AM GMT
జక్కన్న ట్వీట్ యాపారం బాగుందే
X
ప్రస్తుతం ఇండియాలో రాజమౌళి కంటే పాపులారిటీ ఉన్న దర్శకుడు మరొకరు ఉంటారా అంటే సందేహమే. ‘బాహుబలి’తో ఆయన సంపాదించిన అభిమానం అలాంటిలాంటిది కాదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అంటారు కదా.. రాజమౌళి సంపాదించిన అభిమానం అలాంటిదే. రాజమౌళికి సంబంధించి ఏ అప్ డేట్ అయినా జనాలకు ఆసక్తికరమే. అలాగే ఆయన ఏం మాట్లాడినా జనాలు ఆసక్తిగా గమనిస్తారు. రాజమౌళి ఏదైనా సినిమా గురించి ఒక ట్వీట్ చేశాడంటే చాలు.. దానికి వచ్చే ప్రచారం మామూలుగా ఉండదు. కోట్లు విలువ చేసే ప్రచారం వస్తుంది ఆ సినిమాలకు. ఐతే జక్కన్న ఏ సినిమా పడితే ఆ సినిమా గురించి స్పందించడు. తనకున్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలనుకోడు. తనకు అత్యంత సన్నిహితులైన వ్యక్తులకు సంబంధించిన సినిమాల్ని మాత్రమే ప్రమోట్ చేస్తాడు.

తాజాగా ఆయన తనకు చాలా దగ్గరి వాళ్లయిన ఇద్దరు వ్యక్తుల సినిమాలకు మంచి ప్రచారం కల్పించాడు. అందులో ఒకరు ఎన్టీఆర్ అయితే.. ఇంకొకరు సాయి కొర్రపాటి. ఎన్టీఆర్ కొత్త సినిమా ‘జై లవకుశ’ నుంచి ఫస్ట్ టీజర్ రెండు రోజుల కిందటే రిలీజైన సంగతి తెలిసిందే. అది చూసి రాజమౌళి ఆశ్చర్యపోయాడు. ఒక సినిమా ప్రచారం ఎలా మొదలుపెట్టాలో చెప్పడానికి ‘జై’ టీజర్ రుజువన్న జక్కన్న.. తారక్ వావ్ అంటూ అచ్చెరువొందాడు. ఈ ట్వీట్ ‘జై లవకుశ’ టీంకు ఎంతటి బూస్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీంతో పాటుగా జక్కన్న ఓ చిన్న సినిమా గురించి కూడా స్పందించాడు. జగపతిబాబు హీరోగా సాయి కొర్రపాటి నిర్మించిన ‘పటేల్ సార్’ నుంచి రిలీజైన ప్రమోషనల్ సాంగ్ చూసి మాట్లాడుతూ.. జగపతిబాబు అందరికీ షాకిస్తున్నాడని.. ఆయన స్టైలింగ్.. యాటిట్యూడ్ మామూలుగా లేవని.. ఈ సినిమా కోసం ఆగలేకపోతున్నానని అన్నాడు జక్కన్న. ‘పటేల్ సార్’ లాంటి చిన్న సినిమాకు జక్కన్న ట్వీట్ ఎంతటి ప్రచారం తీసుకొస్తుందో అంచనా వేయొచ్చు. రాజమౌళి ఈ రోజు రిలీజవుతున్న సాయి కొర్రపాటి మరో సినిమా ‘రెండు రెళ్లు ఆరు’ గురించి కూడా స్పందిస్తాడని భావిస్తున్నారు. మొత్తానికి ఈ ట్వీట్ల ద్వారా తన మిత్రుల సినిమాలకు వెలకట్టలేని ప్రచారం కల్పిస్తున్నాడు జక్కన్న.