Begin typing your search above and press return to search.

అది వరం లాంటి శాపం - రాజమౌళి

By:  Tupaki Desk   |   2 Sept 2015 10:31 AM IST
అది వరం లాంటి శాపం - రాజమౌళి
X
రాజమౌళికి వాళ్ళ నాన్న విజయేంద్రప్రసాద్ కథలే వరం. ఇక శాపాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే.. ఇక్కడ సబ్జెక్ట్ జక్కన్న కాదు మెగా హీరో వరుణ్ తేజ్. వరుణ్ నటించిన కంచె సినిమా ట్రైలర్ నిన్న రాజమౌళి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ వేదికపై జక్కన్న వరుణ్ గురించి చెబుతూ.. వరుణ్ లాంటి సినిమా కుటుంబం నుండి వచ్చిన నటులకి వారి నేపథ్యం వరం లాంటి శాపం అన్నారు. ఎందుకంటే.. కొత్తగా వచ్చేవారు ఏం చేసినా ఆ కుటుంబంలోని ఇతర నటులతో పోలుస్తూ వుంటారు అని చెప్పిన ఈ దర్శక ధీరుడు ఎవరినీ ఫాలో అవకుండా నీకంటూ ఒక స్టైల్ ఏర్పరచుకో అని వరుణ్ కి సలహా ఇచ్చారు.

రాజమౌళి సలహా బాగానే వున్నా, ప్రస్తుతం వరుణ్ వెళుతున్నది ఆ రూట్ లోనే. ముకుంద సినిమా తోనే ఇది స్పష్టమయింది. అల్లు శిరీష్ తప్ప మిగిలిన మెగా హీరోలు అందరూ తమ మొదటి సినిమాకి ఫార్ముల కథలనే ఎంచుకున్నారు. అందుకనే మెగా అభిమానుల్లో కొంతమందికి ముకుందుడు నచ్చలేదు. నిజానికి ఆ సినిమా తీసిపారేసేది అయితే కాదు. వరుణ్ కోసమో లేక కథ కోసమో తెలీదు కానీ తొలిసారి శ్రీకాంత్ అడ్డాల తన సినిమాలో ఫైట్ సీన్స్ కూడా చూపించారు. ప్రస్తుతం విడుదలకు సిద్ధమవుతున్న కంచె కూడా భిన్నమైన కథే. ఆ లెక్కన వరుణ్ ప్రయత్నం బాగానే వుంది ఫలితమే...?! ఈ సినిమాతోనైనా ఆ కంచె దాటితే వరుణ్ తో పాటు దర్శకుడు క్రిష్ కి తొలి కమర్షియల్ సక్సెస్ వచ్చినట్టే.