Begin typing your search above and press return to search.

రూసో బ్రదర్స్ ఇంట్రాక్షన్ లో రాజమౌళి చెప్పిన RRR విశేషాలు..!

By:  Tupaki Desk   |   30 July 2022 1:30 PM GMT
రూసో బ్రదర్స్ ఇంట్రాక్షన్ లో రాజమౌళి చెప్పిన RRR విశేషాలు..!
X
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'ఆర్.ఆర్.ఆర్' సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా.. వరల్డ్ వైడ్ గా భారీ వసూళ్లను రాబట్టింది. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన తర్వాత ఈ సినిమాకు గ్లోబల్ రీచ్ వచ్చింది. ఎంతోమంది హాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ మూవీపై ప్రశంసలు కురిపించారు.

'ది గ్రే మ్యాన్' మేకర్స్ రూసో బ్రదర్స్ RRR చిత్రాన్ని చూసి దర్శకుడు రాజమౌళి ని ప్రశంసించడమే కాదు.. ఆయనతో కలసి సినిమా చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో రాజమౌళి మరియు రూసో బ్రదర్స్ తో నెట్‌ ఫ్లిక్స్ సంస్థ స్పెషల్ ఇంటరాక్షన్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా వరల్డ్ సినిమా గురించి.. ట్రిపుల్ ఆర్ చిత్రానికి అంతర్జాతీయ ప్రశంసలు దక్కడం గురించి జక్కన్న మాట్లాడారు.

నెట్‌ ఫ్లిక్స్‌ లో భారతదేశం నుండి అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రంగా RRR అవతరించింది. 15 విభిన్న భాషల్లోకి సబ్ టైటిల్స్ తో స్ట్రీమింగ్ చేయబడిన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా 47 మిలియన్‌ అవర్స్ కు పైగా వీక్షించబడింది. వరుసగా 13 వారాల పాటు ట్రెండింగ్ లో కొనసాగింది. ఈ ఊహించని రెస్పాన్స్ తనకెంతో సంతోషాన్ని కలిగించిందని జక్కన్న తెలిపారు. నిజంగా RRR కు పాశ్చాత్య దేశాల నుండి వచ్చిన ఆదరణతో నేను ఆశ్చర్యపోయానన్నారు.

"మంచి కథ ఎవరికైనా మంచి కథే. కానీ వెస్ట్రన్ సెన్సిబులిటీస్ కి తగ్గట్టుగా సినిమాలు తీయగలనని నేను అనుకోలేదు. నేనెప్పుడూ నన్ను నమ్మలేదు. కానీ ఇది నెట్‌ ఫ్లిక్స్‌ లోకి వచ్చి ప్రజలు చూడటం ప్రారంభించినప్పుడు.. మౌత్ టాక్ స్ప్రెడ్ అయినప్పడు.. విమర్శకులు మంచి సమీక్షలు ఇవ్వడం ప్రారంభించినప్పుడు.. అవును నేను నిజంగా చాలా ఆశ్చర్యపోయాను" అని రాజమౌళి తెలిపారు.

'ఆర్.ఆర్.ఆర్' ఇంటర్వెల్ సీక్వెన్స్ కి అన్ని వర్గాల నుండి విశేష స్పందన వచ్చిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జూనియర్ ఎన్టీఆర్ జంతువులతో కలిసి ఓ వ్యాన్ నుంచి దూకే ఈ సీన్ క్లిప్పింగ్ ఒకటి.. ట్విట్టర్‌ లో 13 మిలియన్లకు పైగా వ్యూస్ పొందిందంటేనే ఎలాంటి స్పందన వచ్చిందో అర్థం అవుతుంది. వెస్టర్న్ ఆడియన్స్ ని ఈ సన్నివేశం విస్మయానికి గురి చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ స్పెషల్ సన్నివేశం గురించి మాట్లాడుకున్నారు.

ఈ నేపథ్యంలో రూసో బ్రదర్స్‌ తో తాజా ఇంటరాక్షన్‌లో రాజమౌళి RRR సీక్వెన్స్ గురించి వివరించారు. ''ఎన్టీఆర్ క్యారక్టర్ డిజైనింగ్ నుంచి ఈ సీన్ వచ్చింది. మేము ఈ పాత్ర స్ట్రెంత్ ని బట్టి సీక్వెన్స్ ప్లాన్ చేసాం. భీమ్ అడవుల్లో నుండి వచ్చినవాడు. అతనికి జంతువులతో సంబంధం ఉండటం సహజం. అలా ఈ సీక్వెన్స్‌ ని డిజైన్ చేసాం. వ్యూయర్స్ ని సర్ ప్రైజ్ చేయడం నాకు చాలా ఇష్టం మరియు ఈ సీక్వెన్స్ అందరికీ నచ్చినందుకు సంతోషంగా ఉంది'' అని రాజమౌళి అన్నారు.

ఇకపోతే రూసో బ్రదర్స్ ఈ సంభాషణ గురించి ట్వీట్ చేస్తూ.. ''గ్రేట్ ఎస్.ఎస్. రాజమౌళిని కలవడం చాలా గొప్ప గౌరవంగా భావిస్తున్నాం'' అని పేర్కొన్నారు. దీనికి జక్కన్న స్పందిస్తూ.. ''గౌరవం మరియు ఆనందం నావి.. ఇది గొప్ప ఇంట్రాక్షన్. మీ క్రాఫ్ట్‌ ను కలుసుకోవడానికి దాన్నుంచి ఎంతో కొంత నేర్చుకోడానికి ఎదురు చూస్తున్నాను'' అని అన్నారు.

కాగా, RRR ఈ ఏడాది భారతదేశంలో అత్యధిక వసూళ్లు చేసిన రెండవ చిత్రంగా నిలిచింది. నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చినప్పుడు వెస్ట్రన్ కంట్రీస్ లో అరుదైన క్రాస్‌ ఓవర్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ వంటి ఇద్దరు నిజ జీవిత యోధుల స్పూర్తితో 'ఆర్.ఆర్.ఆర్' కథ రాసుకున్నారు. డీవీవీ దానయ్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందింది.