Begin typing your search above and press return to search.

‘ది కంక్లూజన్’ తర్వాత జక్కన్న ఏం చేస్తాడంటే..

By:  Tupaki Desk   |   25 Feb 2017 5:56 AM GMT
‘ది కంక్లూజన్’ తర్వాత జక్కన్న ఏం చేస్తాడంటే..
X
‘బాహుబలి: ది కంక్లూజన్’ ముగింపు దశకు వచ్చేసింది. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకుని.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుపుకుంటోంది. ఇంకో రెండు నెలల్లో సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చేస్తుంది. విడుదల తర్వాత ఒక నెల రోజుల పాటు రాజమౌళి ఈ సినిమా కోసమే సమయం కేటాయించాల్సి ఉండొచ్చు. మరి ఆ తర్వాత జక్కన్న ఏం చేయబోతున్నాడు.. ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రశ్న ఇది. ఈ మధ్య ప్రచారం జరిగినట్లు ‘మహాభారతం’ సినిమానే చేయబోతున్నాడా.. లేదా వేరే ప్రాజెక్టు ఏదైనా తెరమీదికి తేనున్నాడా..? ఈ ప్రశ్నలకు సమాధానం రాజమౌళి మాటల్లోనే తెలుసుకుందాం పదండి.

‘‘బాహుబలి తర్వాత నేను మహాభారతం తీసేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అది నిజం కాదు. నేను ఇంతకుముందే చాలాసార్లు చెప్పాను. మహాభారతం చేయాలంటే నాకు ఇంకో పదేళ్లు పడుతుందని. ఆ సినిమా చేయడానికి నాకు ఇంకా అనుభవం కావాలి. పదేళ్ల తర్వాత అప్పటి టెక్నాలజీ ఎలా ఉందో చూసుకుని.. కొత్త టెక్నాలజీని ఆకళింపు చేసుకుని సినిమా చేస్తాను. అంతే తప్ప ఇప్పటికిప్పుడు ఈ సినిమా చేయను. ప్రస్తుతానికి ‘బాహుబలి’ తర్వాత ఏంటన్నది నాకే తెలియదు. ఇంకా ఏమీ అనుకోలేదు. ముందు ‘బాహుబలి’ని విడుదలకు సిద్ధం చేయాలి. విడుదల తర్వాత రెండు మూడు వారాలు ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఆ తర్వాత నేను రెక్కలు కట్టుకుని ఎగిరిపోతాను. వెకేషన్‌ కు వెళ్లాలని ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను. ఆ తర్వాత ఏ సినిమా చేయాలి అన్నది నిర్ణయించుకుంటాను’’ అని రాజమౌళి స్పష్టం చేశాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/