Begin typing your search above and press return to search.

అప్పుడు గానీ రాజమౌళి రంగంలోకి దిగలేదట!

By:  Tupaki Desk   |   26 Dec 2021 3:01 PM IST
అప్పుడు గానీ రాజమౌళి రంగంలోకి దిగలేదట!
X
రాజమౌళి సినిమా అనగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకుల దృష్టి ఆ వైపుకు వెళుతుంది. ఆ సినిమా ఎప్పుడు థియేటర్లకు వస్తుందా అనే ఆసక్తి అందరిలోను తలెత్తుతుంది. రాజమౌళి ఎంచుకునే కథలు .. ఆయన ఆ పాత్రలను తీర్చిదిద్దే విధానం .. పాటల విషయంలో తీసుకునే శ్రద్ధ .. గ్రాఫిక్స్ విషయంలో కనబరిచే పరిజ్ఞానం అందుకు కారణమని చెప్పుకోవచ్చు. భారీ సినిమాలు ఇంతకుముందు చాలామంది చేస్తూనే వచ్చారు .. ఇప్పుడు కూడా తీస్తూనే ఉన్నారు. కానీ ఆ భారీతనానికి బలమైన కథాకథలను జోడించడం రాజమౌళి ప్రత్యేకత.

అలాంటి రాజమౌళి తన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి 'ఆర్ ఆర్ ఆర్' ను సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ - చరణ్ హీరోలు అంటూ ఆయన ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చారు. ఎందుకంటే తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అని అభిమానులు కొట్టుకుంటున్న ఈ పరిస్థితుల్లో ఈ ఇద్దరితో ఒకే సినిమా తీయాలనుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తెరపై పాత్రను కాకుండా తమ హీరోను మాత్రమే చూసే అభిమానులు, మల్టీ స్టారర్ సినిమాల విషయంలో తమ హీరోకి అవమానం జరిగిపోయిందంటూ గొడవలు చేసిన సందర్భాలు కనిపిస్తాయి.

అలాంటిది రాజమౌళి ఇంచుమించు ఒకే రేంజ్ ఇమేజ్ కలిగిన ఎన్టీఆర్ - చరణ్ లను ప్రధానమైన పాత్రలకు తీసుకుని సినిమా చేయడమనేది కత్తిమీద సాములాంటిది. ఏ పాత్రలో కాస్త ఎక్కువ తక్కువలు ఉన్నా రచ్చ మొదలవుతుంది. ఇదే విషయాన్ని గురించిన ప్రస్తావన రాజమౌళి దగ్గర తీసుకునిరాగా ఆయన ఇలా స్పందించారు. 'ఆర్ ఆర్ ఆర్' సినిమా చేయడానికి ముందు ఒక రోజున నేను చరణ్ ఫ్యాన్స్ కి కాల్ చేశాను . వాళ్లు తమ హీరో బెస్ట్ అన్నారు. ఎన్టీఆర్ గురించి అడిగితే, ఆయన మంచి నటుడేగానీ తమ హీరోనే బెస్ట్ అని చెప్పారు.

అలాగే ఆ తరువాత ఎన్టీఆర్ అభిమానులకు కాల్ చేసి అదే మాట అడిగాను. వాళ్లు కూడా చరణ్ మంచి ఆర్టిస్టే కానీ తమ హీరో బెస్ట్ అన్నారు. వాళ్లు తమ హీరోలను ఎక్కువగా అభిమానిస్తున్నారే తప్ప, అవతలవారిని ద్వేషించడం లేదనే విషయం నాకు అర్థమైంది. ఎన్టీఆర్ - చరణ్ బయట ఎలా ఉంటారో అదే పద్ధతిని వాళ్ల ఫ్యాన్స్ ఫాలో అవుతున్నారు. ఇద్దరు హీరోల అభిమానుల మధ్య ఎలాంటి ఇబ్బందులు లేవని అర్థమైన తరువాతనే నేను ఈ సినిమాను గురించిన విషయం వాళ్లకి చెప్పాను .. ఆ తరువాతనే మొదలుపెట్టాను. ఎన్టీఆర్ - చరణ్ బయట ఎంత స్నేహంగా ఉంటారో .. అలాగే ఈ సినిమాలోనూ కనిపిస్తారు గనుక, ఇది వాళ్ల అభిమానులకు పూర్తిస్థాయి ఆనందాన్ని కలిగిస్తుంది" అంటూ చెప్పుకొచ్చారు.